Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు లక్షల మందికి శాశ్వత అంధత్వ ప్రమాదం
- నేటి నుంచి గ్లకోమా వారోత్సవాలు : కంటి వైద్య నిపుణులు
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
గ్లకోమా (నీటి కాసులు) నయం చేయలేని జబ్బు. ఒకసారి వస్తే దాన్ని తిరికి వెనక్కి పంపించడం సాధ్యం కాదు. కంటి వెనుకభాగంలో ఉన్న నరం దెబ్బతినడం ద్వారా వచ్చే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది శాశ్వత అంధత్వానికి గురయ్యే ప్రమాదముందని అంచనా. ఎటువంటి నొప్పి, లక్షణాలు లేకుండా క్రమేణా కనుచూపును కనుమరుగు చేస్తున్న నిశ్శబ్ధ అంధత్వ కారకమైన గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు కంటి వైద్యులు సూచిస్తున్నారు. శనివారం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని, గ్లకోమా స్పెషలిస్ట్ ప్రొఫెసర్, డాక్టర్ వెంకటరత్నం, గ్లకోమా విభాగం డాక్టర్ సుపర్ణ, ఆర్ఎంఓ నజఫియా, హైదరాబాద్ జిల్లా అంధత్వ నియంత్రణ అధికారి డాక్టర్ దీపక్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మోదిని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 12 నుంచి 18 వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలోనూ ప్రజల్లో అవగాహన పెంచేలా వారోత్సవాలను వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో నిర్వహించే ప్రదర్శన, సదస్సును వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం వారం రోజుల పాటు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి ఒకసారైనా గ్లకోమా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్లకోమా కలిగిన కుటుంబ చరిత్ర, చుక్కలు, ఇంజెక్షన్స్, ఇన్ హేలర్, చర్మ సంబంధమైన కణాలరుగ్మతలు, క్యాన్సర్ రోగులు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, షటిల్ ఆడే వారు, రెటీనా ఆపరేషన్ అయినవారు, కంటికి చిన్నపాటి దెబ్బతులు తగిన వారు పరీక్షలు చేయించుకోవడం మంచిదని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మందికి వంశపారంపర్యంగా వస్తుందన్నారు. తరచూ కండ్లద్దాలు మార్చాల్సి వచ్చిన వారిలోనూ, తలవెంట్రుకలు రాలిపోతున్నాయని స్టెరాయిడ్స్ ఆయిల్స్ వాడే వారిలోనూ గ్లకోమా వచ్చే ప్రమాదముందన్నారు. గ్లకోమా ఒక కంటిలో మొదలై రెండో కంటిలోనూ పెరిగిపోతుందని హెచ్చరించారు. గ్లకోమా వచ్చిన వారికి కాటరాక్ట్ పరీక్ష చేసినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థల అంచనాల ప్రకారం జనాభాలో ఒకశాతం మందిలో గ్లకోమా ఉందని తెలిపారు. ఆ లెక్కన మన రాష్ట్రంలోనూ నాలుగు లక్షల మందిలో ఈ వ్యాధి వివిధ దశల్లో ఉండే అవకాశముందన్నారు. వీరిలో 90 శాతం మందికి తమలో వ్యాధి పెరుగుతున్న అవగాహన లేదన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే చికిత్స కోసం వస్తున్నారనీ, వారిలోనూ కాలాతీతమైన వారు అంధత్వం బారిన పడుతున్నారనీ, ఇలాంటి వారికి నేత్రదానం ద్వారా కూడా కూడా చూపు తెప్పించలేమని స్పష్టం చేశారు.