Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి : సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో ఏప్రిల్ ఐదో తేదీన జరిగే మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ర్యాలీ జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కార్మికులను, రైతులను దోపిడీ చేస్తూ అదానీ, అంబానీ వంటి కుబేరులకు 'అమృతకాల్' భరోసా కల్పించేందుకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. రోజురోజుకీ నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని పేర్కొన్నారు. చారిత్రాత్మక రైతుల పోరాటం సందర్భంగా రైతు సంఘాలకు మోడీ సర్కారు రాతపూర్వకంగా ఇచ్చిన గిట్టుబాటు ధర ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు పేదలకు దక్కకుండాపోతున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.