Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరును తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, బహిరంగంగా మాట్లాడలేని పదాలతో మాట్లాడిన బండి సంజరుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజరు చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా వున్నాయని తెలిపారు. కవితపై విచారణ జరుగుతున్న క్రమంలోనే అరెస్టులపై ద్వంద అర్థాలు వచ్చే విధంగా సంజరు చేసిన వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళికలో భాగమేనని పేర్కొన్నారు. కవితను అరెస్టు చేస్తారనే నిర్ణయానికి బీజేపీి నాయకులు ముందే వచ్చారని తెలిపారు. ప్రతిపక్షాల నోర్లు నొక్కడానికి ముందస్తు ప్రణాళికతోనే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయమని హిందూ సంస్కృతి, సాంప్రదాయం నేర్పిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజరు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.