Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్ హ్యాకింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవరేసీర్ (టీపీబీవో) పోస్టులకు, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉందని తెలిపారు. వెబ్సైట్ హ్యాకింగ్ కావడంతో ఆయా పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని వివరించారు. అయితే హ్యాకింగ్ కావడంపై అనేక అనుమనాలున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ అధికారులకు తెలియకుండా టీపీబీవో, వీఏఎస్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఎలాంటి స్పష్టత లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.