Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-చిట్యాలటౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ ప్రభుత్వరంగ సంస్థలను దోచిపెడుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో ఆదివారం సీపీఐ(ఎం) నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అదానీ లాంటి కుబేరులకు తగినంత సంపద దోచుకునే సాధనంగా మోడీ విధానాలు రూపొందించుకున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో ధనికవర్గాలకు తప్ప, పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి ప్రజా చైతన్యబస్సు యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల అనంతరం గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం బీజేపీ ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతుందన్నారు. సంపన్న వర్గాలకు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. సీపీఐ(ఎం) ప్రజా చైతన్య బస్సు యాత్రలను జయప్రధం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు మేక అశోక్‌రెడ్డి, అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీను, జిట్ట సరోజ, బొడ్డుపల్లి వెంకటేశ్, చెరుకు పెద్దులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.