Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో పాడి రైతు
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ - శంషాబాద్
కుక్కల దాడిలో మూడు దుడ్డేలు, ఒక లేగ దూడ మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత రైతు నిమ్మల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ రెవెన్యూలోని సర్దార్ మియా (శాస్త్రి బాయి) వద్ద చింత చెట్ల కింద తన బర్రెలను కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లి పడుకున్నారు. తెల్లవారుజామున పశువులు ఉన్న ప్రదేశం వద్దకు వచ్చి చూశాడు. అక్కడ మూడు దుడ్డెలు, ఒక లేగ దూడను కుక్కలు దారుణంగా కరిచి చంపాయి. దాంతో పాడి రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. 20 రోజుల కిందట మహారాష్ట్ర నుంచి రూ.లక్షా 80 వేలు పెట్టి రెండు పాడి బర్రెలను కొనుగోలు చేశానని తెలిపారు. పూటకు నాలుగు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయని చెప్పారు. అకస్మాత్తుగా కుక్కల దాడిలో దూడలు చనిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు ఎట్లా తీర్చాలని వాపోయాడు. వ్యవసాయ పొలాలకు వద్దకు వచ్చే కుక్కల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని కోరారు. కాగా, కుక్కల దాడిలో దూడలు చనిపోవడం సర్వసాధారణమైపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. గ్రామంలో మాంసం విక్రయదారులు మిగిలిన పనికిరాని మాంసాన్ని, కోళ్ల మాంసాన్ని వాటి ముందు పడేయడం వల్ల అవి పూర్తిగా వేట కుక్కలుగా మారి పశువుల మీద పడుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీ నుంచి వారికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోవడం వలన ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఒకవేళ పశువుల ఆహారం లభించకపోతే గ్రామాల్లోనూ పిల్లలపైన, పెద్దల పైన కుక్కలు దాడులు చేస్తున్నాయని, దీనిపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.