Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్న వీడీసీలు
- మాట వినకుంటే కుల బహిష్కరణలు
- అక్రమ వేలంపాటలు, అనుమతులతో ధనార్జన
- అభివృద్ధి పేరుతో ఆక్రమణలు
- కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యం
నవతెలంగాణ - మెట్పల్లి రూరల్
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎనుకున్న నాయకులే పరిపాలన చేస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు పెద్దమనుషులు కలిసి ఎన్నుకున్న గ్రామ అభివృద్ధి కమిటీలు సమాంతర ప్రభుత్వాలుగా అధికారాన్ని గుప్పింట్లోకి తీసుకుని అంతా తామే అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకర్గాన్ని శాసిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ భూ సమస్యతో గ్రామ వీడీసీలకు, ముదిరాజ్ సంఘ సభ్యులకు మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. దీంతో ముదిరాజ్ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) గ్రామ బహిష్కరణ చేసింది. ఇప్పటికే ఐదు నెలలు కావస్తున్నా ముదిరాజ్ కుటుంబాలు బహిష్కరణలోనే ఉన్నాయి. అంతే కాకుండా సర్పంచ్, వీడీసీ పెద్దలు కలిసి ఈ 5ఎకరాల 10 గుంటల స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన భూమి పట్టాదారు ఎడమల సుదర్శన్ రెడ్డి సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. వీడీసీ పెద్దలకు కోరుట్ల నియోజకవర్గ స్థాయి నాయకులు సహ కరించటంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినా ముది రాజ్ కులస్తులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు.
బహిరంగ వేలం పాటలతో ధనార్జన :
గ్రామాల్లో బహిరంగ వేలంపాటలు నిర్వహించి ఎక్కువ డబ్బులు పాట పాడే వారికి గ్రామాల్లో అనుమతులు కట్టబెడుతున్నారు. ఈ పద్ధతిలో వీడీసీలకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోంది. దీంతో ఇసుక, బెల్ట్ షాపులు, మొరం, చికెన్, మటన్, కోడిగుడ్లు, మినరల్ వాటర్, కూల్‌డ్రింక్స్ అమ్మే యజమానులు ధనార్జనే ధ్యేయంగా ఎంతో కొంత డబ్బు వీడీసీలకు ముట్టజెప్పడం ఆనవాయితీగా మారింది. అనుమతులు పొందిన షాప్ యజమానులు అధిక ధరలతో ప్రజలకు విక్రయించడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం గాని, ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పలు గ్రామాల్లో గ్రామ కమిటీలు ఎన్నికలను సైతం ప్రభావతం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
వారిదే అంతిమ తీర్పు
వీడీసీల వేధింపుల వలన ప్రస్తుతం పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఉండాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లోనే కాకుండా, గ్రామ అభివృద్ధిలో పాలు పంచు కొని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకునేవారు. కానీ ప్రస్తుతం గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీడీసీ సభ్యులకు రాజకీయ నాయ కుల అండతో వారు విపత్కర ధోరణి కొనసాగిస్తున్నారు. వారి మాట వినని వారిని గ్రామ బహిష్కరణ చేస్తూ రాజ్యాం గాన్ని సైతం ధిక్కరిస్తున్నారు. వీడీసీల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక రాజకీయ నాయకుడి అండతో కేసుల నుండి తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
తిష్ట వేసుకొని కూర్చుంటున్న అధ్యక్షుడు, సభ్యులు :
మెట్పల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులను ఎన్నుకుంటుంటే, కొన్ని గ్రామాల్లో ఎన్నికలే లేకుండా అధ్యక్షులు, కమిటీ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసుకుని కూర్చుంటున్నట్లు సమాచారం. గ్రామాన్ని అన్ని విధాలుగా దోచుకుంటూ, ప్రజల్ని మోసం చేస్తూ రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ, పీఠాన్ని అధ్యక్షులు వదులుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు శృతిమించిన గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వీడీసీ పెద్దలు మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు..
కొండ్రికర్ల గ్రామంలోని 5 ఎకరాల 10 గుంటలు భూమి మా తాతలు, తండ్రుల నుండి స్థిరాస్తిగా ఉంది. ఈ భూమి పట్టా ఇప్పటికీ మా దగ్గరే ఉంది. మా కుటుంబంలో ఈ భూమిని ఎవరూ ఎవరికీ దానధర్మాలు చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా బీడు భూమిగా ఉండడంతో ఇప్పుడు కొందరు వీడీసీ పెద్దలు, సర్పంచ్ అందరూ కలిసి మా భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు నిజా నిజాలను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
- ఎడమల సుదర్శన్ రెడ్డి, జగ్గసాగర్.
కక్ష కట్టి గ్రామ బహిష్కరణ చేశారు...
జగ్గసాగర్ గ్రామానికి చెందిన ఎడమల సుదర్శన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింహా రెడ్డికి సంబంధించిన 5 ఎకరాల 10 గుంటల భూమి కొండకర్ల గ్రామ శివారులో ఉంది. ఈ భూమిని పంపకాలు జరపగా ఎడమల సుదర్శన్ రెడ్డికి తన వంతుగా 2 ఎకరాల 25 గుంటలు భూమి రాగా... గత ఐదారు దశాబ్దాలుగా బీడు భూమిగా ఉంది. దీనిని గుర్తించిన కొండ్రికర్ల గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులందరం 2013లో ఎడమల సుదర్శన్ రెడ్డిని సంప్రదించి పెద్దమ్మ దేవాలయం నిర్మాణం చేసుకుంటుం టామని, కుల పెద్దలం అడగగా ఒప్పుకున్నారు. గుడి నిర్మాణం కోసం సర్వే నెంబరు 994/1/2 గల 10 గుంటల భూమి అవసరమవుతుందని సుదర్శన్ రెడ్డికి తెలిపి ఏడు గంటల భూమిలో గుడి నిర్మించాము. తర్వాత 2016లో 10గుంటల భూమికి సంబంధించి విలువ రెండున్నర లక్షల రూపాయలు సుదర్శన్ రెడ్డికి ముట్టజెప్పి 50 రూపాయల విలువ గల బాండ్ పేపర్ పైన రాసుకున్నాం. అయితే ఇటీవల ప్రభుత్వ సహాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంఘ సభ్యులందరం కలిసి జిన్నా శంకర్ అను నా పేరు మీద ఆరు నెలల కిందట రిజిస్టర్ చేయించాం. ఈ 5 ఎకరాల 10 గుంటల భూమి గ్రామానికి సంబంధించిందని కక్ష కట్టిన వీడీసీ పెద్ద మనుషులు ముదిరాజ్ కులస్తులందరినీ గ్రామ బహిష్కరణ చేశారు. ఇప్పటికీ మా కుటుంబాలను బహిష్కరించి ఐదు నెలలు కావస్తుంది. ఎంతమంది అధికారులను కలిసిన ఇప్పటికీ మాపై దయ చూపలేదు సరి కదా వీడీసీ సభ్యులకే వత్తాసు పలుకుతున్నారు. ఈ కుట్రలో పదవిలో ఉన్న నియోజకవర్గ స్థాయి నాయకులు భాగస్వాములుగా ఉన్నారు. మాకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నాం.
- జిన్నా శంకర్ ముదిరాజ్, కొండ్రికర్ల.
భూమి కొనుగోలు చేస్తే తిడుతున్నారు..
ఎడమల జనార్దన్ రెడ్డి, నర్సింహా రెడ్డి (జగ్గసాగర్) వంతుగా వచ్చిన భూమి రెండు ఎకరాల 25 గుంటల భూమి 26 లక్షల రూపాయలకు ఒక సంవత్సరం క్రితం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. రెండు సార్లు రైతుబంధు కుడా తీసుకున్నాను. కానీ ఇప్పుడు వీడీసీ సభ్యులు నాతో ఈ భూమి గ్రామానికి సంబంధిం చిందని, ఎట్లా కొంటావు అని తిడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.
- డబ్బా లక్ష్మీరాజాం, జగ్గసాగర్.