Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకో హఠావో.. దేశ్‌కో బచావో నినాదంతో ప్రజల వద్దకు
- జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంబేద్కర్ జయంతిరోజున ఏప్రిల్ 14 నుంచి బీజేపీకో హఠావో దేశ్‌కో బచావో నినాదంతో ప్రజల ముందుకెళ్తున్నామనీ, ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. మే 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, మతోన్మాద విధానాలను ఎండగడతామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్‌కార్డులు, భూ సమస్యలు, దళితబంధు, పెన్షన్ వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇంటింటికీ సీపీఐ పేరుతో పాదయాత్ర, బస్సుయాత్ర, మోటార్ సైకిళ్ల యాత్రలు 119 నియోజకవర్గాల్లో జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర నాయకులు తనతోపాటు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి ప్రారంభిస్తామని చెప్పారు. 2024లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామన్నారు. మతోన్మాద, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతం చేస్తామని అన్నారు. ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని తమ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రారంభిస్తారనీ, కొత్తగూడెంలో ముగింపు సభకు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరవుతారని వివరించారు. జూన్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రనాయకత్వం ఆధ్వర్యంలో రాజకీయ నినాదంతో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ముగింపు సభను హైదరాబాద్‌లో లక్ష మందితో నిర్వహిస్తామని చెప్పారు.
25న విభజన హామీలపై బయ్యారం నుంచి పాదయాత్ర
విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో బయ్యారం నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు కూనంనేని అన్నారు. ఈ ప్రజా పోరు పాదయాత్ర ఏప్రిల్ 25న హన్మకొండలో జరిగే బహిరంగసభతో ముగుస్తుందన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా 13.5 లక్షల మందికి 14 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. జీవో 58,59 ప్రకారం గుడిసెలు, ఇండ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం దరఖాస్తుల గడువు పెంచడాన్ని హర్షిస్తున్నామని చెప్పారు. 2020 వరకు అనే నిబంధనను సడలించాలనీ, ఇప్పటి వరకు ఉన్న గుడిసెలను పరిగణనలోకి తీసుకుని ఆ భూములను క్రమబద్ధీకరించాలని కోరారు.
ఇండ్లు కట్టుకునేందుకు వీలుగా గృహలక్ష్మి కింద వారికి రూ.మూడు లక్షలు కాకుండా రూ.ఐదు లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. 59 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ రుసుం చాలా ఎక్కువగా ఉందనీ, దాన్ని నామమాత్రంగా నిర్ణయించాలనీ, లేదంటే 500 గజాల్లోపు వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఇంటి స్థలం లేనివారికి స్థలాలివ్వాలని చెప్పారు. కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. బండి సంజరుపై కేసు పెట్టాలనీ, ఆయన తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మోడీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయన రాక్షసులకు ప్రతినిధా? ప్రజాస్వామ్యానికి ప్రతినిధా?అని ప్రశ్నించారు. అవినీతి సామ్రాట్ మోడీ అని అన్నారు. బీజేపీ నాయకుల్లో ఒక్కరిపైనా కేసు పెట్టడం లేదనీ, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వారిని ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతోనే బీజేపీ ఓటమి సాధ్యమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, బాల నర్సింహా, తక్కెల్లపల్లి శ్రీనివాస రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.