Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్' సదస్సులో కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అన్నింటా విఫలమైన బీజేపీ తప్పనిసరిగా ఓడిపోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ, మూడు నల్లచట్టాలు తెచ్చి, 750 రైతుల ఆత్మహత్యలకు కారణమవటం తప్ప చేసేందేమీ లేదన్నారు. హైదరాబాద్‌లో ప్రతి ఇంటికీ 24 గంటల నీటి సరఫరా ఇస్తుంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రోజుకు రెండు గంటలే నీటి సరఫరా అవుతున్నదని గుర్తుచేశారు. ప్రజలకు కావాల్సిన తాగు, సాగు నీరు, ఉద్యోగాలు వంటి కనీస అవసరాలను కూడా బీజేపీ సర్కారు తీర్చలేకపోయిందని విమర్శించారు. ముంబయిలో ఒక ప్రముఖ ఛానల్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023' పేరిట నిర్వహించిన సదస్సులో '2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం' అనే అంశంపై కవిత మాట్లాడారు. 2014లో 282 సీట్లతో బీజేపీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చినప్పుడు, ఆ పార్టీ అనేక హామీలిచ్చిందని గుర్తుచేశారు. నల్లధనం తెస్తామనీ, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామనీ, రూపాయి విలువ పడిపోకుండా ఆపడం వంటి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. 303 సీట్లతో
బీజేపీకి ప్రజలు రెండోసారి అధికారాన్ని అందించారనీ, మూడు వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చి, 750 రైతుల ఆత్మహత్యలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లపాటు అధికారంలో ఉండి పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తక్కువ ధరకే మంగళయాన్ శాటిలైట్‌ను తయారు చేయగలిగిన మనదేశం...ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నామని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. ఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థల్లో 28వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదని విమర్శించారు. విద్యార్థులకు సరైన విద్య అందించకుండా విశ్వగురువు ఎలా అవుతామని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. జనగణన, ఓబీసీల జనగణన చేపట్టాలని కోరారు. సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, సీపీఐ లాంటి అనేక విపక్షాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం విభజించు...పాలించు పద్దతిని పాటిస్తే, నేడు బీజేపీ ప్రభుత్వం రైడ్ అండ్ రూల్ పద్దతిలో ముందుకుపోతున్నదని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీ మీద దాడులు చేయడం, పార్టీని విడగొట్టి దొడ్డిదారిలో పరిపాలించడమే బీజేపీ ప్రస్తుత విధానమని ఎద్దేవా చేశారు. అనేక మంది ప్రతిపక్ష పార్టీ నేతలపై విచారణ జరుపుతున్న మోడీ...అదానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.