Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో హోంమంత్రి అమిత్‌షా
- అమరజవాన్లకు నివాళి
- తీవ్రవాద నిర్మూలనకు భద్రతా దళాలు పనిచేస్తున్నాయని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామనీ, సీఐఎస్ఎఫ్ మూలంగానే నక్సలైట్లు, టెర్రరిస్టులు అదుపులో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో జరిగిన 54వ సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌కు హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 53 ఏండ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తున్నదనీ, దేశ ఆర్థికప్రగతిలోనూ పారిశ్రామిక భద్రతా దళాల పాత్ర విస్మరించలేనిదన్నారు.. మూడు వేల సిబ్బందితో ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ ఇప్పుడు లక్షా 70వేల మందితో సేవలు అందిస్తున్నదని తెలిపారు. దేశ వ్యాప్తంగా రోజూ ఎయిర్‌పోర్టులు, ఢిల్లీ మెట్రో, ఇతర సంస్థల్లోని కార్యకలాపాల ద్వారా 50లక్షల మంది ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ డే నాడే జాతిపిత మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టారనీ, అప్పుడు దేశవ్యాప్తంగా పెద్దసంచలనమే అయిందని చెప్పారు. ఒక్క లాఠీ లేకుండా దేశానికి స్వాతంత్య్రాన్ని గాంధీజీ తెచ్చారని వివరించారు. దేశ రక్షణతోపాటు ఆర్థిక తోడ్పాటును అందించడంలో సీఐఎస్ఎఫ్ ముఖ్యపాత్రను వహిస్తున్నదన్నారు. డ్రోన్, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఐఎస్ఎఫ్కు జోడించి అద్భుతమైన ఫలితాలు రాబడతామని వ్యాఖ్యానించారు. ప్రయివేటు సంస్థలకు భద్రత కల్పించడంలోనూ సీఐఎస్ఎఫ్ ముందుందని చెప్పారు. డ్రగ్స్, స్మగ్లింగ్ వంటి సంఘవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నదని అభినందించారు.
సీఐఎస్ఎఫ్ త్యాగాలు అసమానం: సీఐఎస్ఎఫ్ డీజీ శీల్వర్ధన్సింగ్
పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ప్రజల రక్షణ, భద్రత కల్పించడంలో సీఐఎస్ఎఫ్ అసమాన త్యాగాలు చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ శీల్వర్థసింగ్ అభిప్రాయపడ్డారు. రైజింగ్ డే పరేడ్ సందర్భంగా ఆయ స్వాగతోపన్యాసం చేశారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ(ఎన్ఐఎసనే-నిసా) కేంద్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్లకు జోహార్లు అర్పిస్తున్నట్టు తెలిపారు. 'నిసా'లో సీఐఎస్ఎఫ్ దినోత్సవాన్న నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షాతోపాటు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శీల్వర్థన్సింగ్, ఎంపీ కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కమాండెంట్ అభిషేక్‌సింగ్ చౌధురి నాయకత్వంలో పరేడ్ జరిగింది.
సీఐఎస్ఎఫ్ మాక్ డ్రిల్స్..
అబ్బుర పరిచిన కేరళ 'కలరిపయట్టు' విన్యాసం
రైజింగ్ డే పరేడ్ సందర్భంగా సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రత్యేకంగా ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియజేసే మాక్‌డ్రిల్ ప్రదర్శన దాదాపు అరగంటకుపైగా నిర్వహించారు. కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ 'కలరిపయటు'్ట విన్యాసాలను మహిళా జవాన్లు ప్రదర్శించి, ఆహూతులందిరినీ మంత్రముగ్ధులను చేశారు. రసాయన పరిశ్రమల్లో గ్యాస్‌లీక్ వంటి సమస్యలు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు తీసుకునే చర్యలపై చేసిన విన్యాసాలు సైతం ఆహాతులను ఆకర్షించాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు హోంమంత్రి రివార్డులు అందజేశారు.
ప్రెస్‌మీట్ రద్దు
రైజింగ్ డే పరేడ్‌కు విచ్చేసిన హోంశాఖ మంత్రి అమిత్‌షా అనంతరం మీడియాతో మాట్లాడతా రంటూ సీఐఎస్ఎఫ్ అధికారులు ముందుగా ప్రకటించారు. దాదాపు గంట తరువాత ప్రెస్‌మీట్ కోసం సీఐఎస్ఎఫ్ గెస్ట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఆయన కొచ్చికి వెళ్లేతొందరలో మీడియా పాయింట్ పక్క నుంచే బై బై అంటూ చేతులూపుతూ ముందుకు సాగిపోయారు. కొద్దిసేపు మాట్లాడాలని మీడియా విజ్ఞప్తి చేసినా పట్టించు కోకుండా నేరుగా వాహనంలో కూర్చుని హాకీంపేట విమానాశ్రయానికి వెళ్లిపోవడం గమనార్హం.
మీడియాలో గుసగుసలు
అమిత్‌షా మీడియాతో మాట్లాడతారని చెప్పంగానే మీడియాలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ విషయమై అమిత్‌షాను ప్రశ్నించాలనే ఉత్సుకతతో మీడియా ఉంది. అయితే అమిత్‌షా ప్రెస్‌మీట్‌కు రాకుండానే వెళ్లిపోవడంతో ఒకింత నిరాశ కనిపించింది. మాట్లాడితే అనవసరమైన రచ్చ జరుగుతున్నదనే భావనతోనే అమిత్‌షా వెళ్లిపోయారని బీజేపీ శ్రేణులు చెప్పడం గమనార్హం. అలాగే సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌ను మొదటిసారిగా న్యూఢిల్లీ వెలుపల హైదరాబాద్‌లో నిర్వహించడం కూడా వ్యూహాత్మకమేనని తెలిసింది. ఈ ఏడాది చివర తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పారామిలిటరీ దళలా పరేడ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టు వినికిడి.