Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరీ పరివాహకంలో వందేండ్లకు సరిపోయే బొగ్గు
- కేంద్రం అనుమతి కోసం సింగరేణి పడిగాపులు.... దేశ రక్షణ పెట్టుబడిదారులకే...
మోడీ కంటే ముందు భారతదేశంలో అభివృద్ధే లేదన్నట్టు ''భక్తుల భజన''. దాదాపు గత డెబ్బయ్యేండ్లుగా ఫుడ్ కార్పోరేషన్ ధాన్యం, గోధుమలు మన రైతాంగం నుంచి కనీస మద్దతు ధరిచ్చి కొని ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి?
సింగరేణి తెలంగాణ కొంగు బంగారం! ఒకప్పుడు లక్షమందికి పైగా ఉన్న కార్మికులు, ఉద్యోగులు నేడు 43 వేలకు, గతంలో ఒక్కరు కూడా లేని కాంట్రాక్ట్ కార్మికులు నేడు 25 వేలకు చేరారు. ఎనిమిది నియోజక వర్గాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది సింగరేణి. గత ఆరేండ్లలో రాష్ట్రానికి 15 వేల కోట్లు, కేంద్రానికి రూ. 13,500 కోట్లు వివిధ పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. దీనిలోని అధికారులు కార్మికులు కేంద్రానికి సంవత్సరానికి మొత్తం వెయ్యి కోట్ల ఆదాయ పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ సింగరేణి గొంతు పిసుకుతున్నారు. ఎవరికోసం...?
ఆరెస్బీ
సింగరేణి 'గర్భశోకం' : గోదావరీ పరివాహక ప్రాంతాల్లో మరో వందేండ్లకు పైబడి సరిపోయే బొగ్గు నిల్వలున్నాయి. ఇప్పుడున్న బొగ్గు బావులు, ఓపెన్‌కాస్ట్‌లు మరో పదేండ్ల కంటే రావని అంచనా. 15 గుర్తించిన బావుల సర్వే జరిగి, కేంద్రం అనుమతి కోసం అర్జీలిచ్చి పడిగాపులు పడాల్సి వస్తోంది మన సింగరేణి. మన తెలంగాణ నేల. మన సింగరేణి. మన నిక్షేపాలు. అయినా తవ్వరాదట! ఓపెన్ టెండర్లో పాల్గొనాలి. తీరా మనం చెమటోడ్చి కాంట్రాక్టు దక్కించుకున్నా సాలుకి 14 శాతం రెవెన్యూ షేరింగ్ చెయ్యాలట! అంటే సామ్రాట్టుకు కప్పం చెల్లించాలట!.
రాష్ట్రం కూడా తాను కొన్న బొగ్గుకి పైసలివ్వదు. ఆ బొగ్గుతో ఉత్పత్తి అయిన కరెంటుకి రూ. 12 వేలకోట్ల బకాయి పడింది. కారణం, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడం. సింగరేణి ప్రయివేటైజేషన్‌కు తమకు సంబంధమే లేదని 'బండి' వారి గ్యాంగు ప్రచారం! కాని ఐదు బ్లాకులు అర్రాజు పెట్టింది వారే. కోయగూడెం 'బ్లాకు'ను మాయచేసి, మంత్రం వేసి అరబిందో ఫార్మాకి కట్ట బెట్టారు. సదరు పెద్దమనిషి లిక్కర్ స్కాంలో ఊచల్లెక్కబెడ్తున్నాడిప్పుడు. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలేం సమాధానం చెప్తారు? సంజయా ! తెలంగాణలో మీ నంగనాచి కబుర్లు చెల్లవు?!
దేశరక్షణ కూడా అదానీదేనా? : మన కండ్లముందే దెబ్దతిని పోతున్న మరో కీలక సంస్థ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. దాదాపు ఏడాదిన్నర క్రితం ఏడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన వాటిలో ఇది ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్)లో ఉంది. 2024-25 నాటికి రూ. 30 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటికి రూ. తొమ్మిది వేల కోట్లు చేరలేదు దీని టర్నోవర్.
ఇటీవల 12 లక్షల డిజిటల్ యూనిఫార్మ్స్- ట్రూప్స్ కంఫర్ట్స్ లిమిటెడ్ (టీసీఎల్)కి అసలు ఆర్డరే ఇవ్వకుండా దిగుమతి చేసుకుందీ మోడీ ప్రభత్వం.
గత ఐదు సంవత్సరాల్లో రూ. 2 లక్షల కోట్లు మిలటరీ ఎక్విప్మెంట్ దేశంలోకి దిగుమతి చేసుకున్నారని ఇటీవల ఎన్డీటీవీ వార్త ప్రసారం చేసింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంతర్జాతీయ బజార్లో తిరిగి ఆర్డర్లు సంపాదించుకోవాలట! మన మిలటరీకి చెందిన ఆర్డర్లు మాత్రం అదానీకి, ఎల్ ఆండ్ టీకి ఇస్తారట! వ్వా! మోడీసాబ్! వ్వా..!!.
భజనవద్దు! నిజాలు చూడండి..!
మోడీ కంటే ముందు భారతదేశంలో అభివృద్ధే లేదన్నట్టు ''భక్తుల భజన''. దాదాపు గత డెబ్బయ్యేండ్లుగా ఫుడ్ కార్పోరేషన్ ధాన్యం, గోధుమలు మన రైతాంగం నుంచి కనీస మద్దతు ధరిచ్చి కొని ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి? భారీనీటి ప్రాజెక్టులు కట్టి ఆహార ధాన్యాల స్వయం ప్రతిపత్తి సాధించకపోయుంటే ప్రాణ తర్పణాలతో సాధించుకున్న స్వాతంత్య్రం కుక్కలు చించిన విస్తరైయుండేది కదా! అంబేద్కర్ రాసిన విద్యుత్ (సప్లై) చట్టం 1948 విద్యుత్‌ను ప్రజలకు కొనుక్కోగలిగిన రేట్లకు (అఫార్డబుల్ ప్రైస్) అందించాలని అంది.
ఫుడ్ కార్పొరేషన్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్లు రెండూ కేంద్ర ప్రభుత్వ రంగం పరిశ్రమలే! ఇవి రెండూ ధ్వంసమై, విద్యుత్ ప్రయివేటు పరమైతే మన దేశ పరిస్థితేమిటి?
తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం నుంచి రూ. 1,07,777.37 కోట్ల ఖరీదు చేసే ధాన్యం ఎఫ్‌సీఐ కొనింది. ఇదే లేకుంటే మన రైతాంగం పరిస్థితేంటి? ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మన రాష్ట్రంలో పత్తి కొనకపోతే ఆదిలాబాద్ రైతన్న అల్లాడిపోవడం లేదా?
మౌలిక వసతుల కల్పనకు ఒక మన తెలంగాణకే ఎల్ఐసీ రూ. 90 వేల కోట్లు సమకూర్చింది. జీహెచ్ఎంసీలో మురుగునీటి సౌకర్యాలు మొదలు, వీధి దీపాలకు, రోడ్లకు ఈ డబ్బు ఖర్చు చేసారు. ఎల్ఐసీ ఐపీఓ తర్వాత ఎల్ఐసీ చట్టంలోని సెక్షన్ 27(ఎ)ను సవరిస్తున్నారు. గతంలో 25 శాతమే ప్రయివేటులో పెట్టుబడి పెట్టాలన్న ఆంక్షలు పోయి సంపూర్ణంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఏర్పడింది. ఇప్పుడిక ఎల్ఐసీ డబ్బతో అదానీ లాంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో 5-6 శాతం వడ్డీకి దొరికే సౌలభ్యం మన జనం కోల్పోతారు. ఇదంతా మోడీ పుణ్యమే!
బీజేపీ సైద్ధాంతికంగానే ప్రభుత్వ రంగానికి వ్యతిరేకం. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర ఉండరాదని వారి ఆలోచన. జన సంఘం ప్రారంభకులు, వారి సిద్ధాంత కర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ విషయం స్పష్టంగా చెప్పారు. 1949లోనే ప్రయివేటు పెట్టుబడికి పూర్తి సేచ్ఛనివ్వాలన్నారు. 'వర్గ పోరాటం' తప్పన్నారు. 'ఉత్పత్తి పెంచడానికి శ్రమ పెట్టుబడితో సహకరించాలన్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఉత్పత్తి ఎవరికి లాభం చేకూరుస్తోందో అందరూ నేడు గమనిస్తున్నారు కదా!
ప్రభుత్వ రంగ పరిశ్రమలు విధ్వంసం
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ''ప్రభుత్వరంగం పుట్టిందే చావడానికి, కొన్ని పుట్టగానే చస్తాయి! కొన్ని కొంత కాలానికి చస్తాయి!'' అన్నారు మోడీసాబ్! కంస మామలుంటే పుట్టంగానే చావరా పోరగాండ్లు!?.
- హెచ్ఎంటీ వాచ్ డివి జన్, హెచ్ఎంటి బేరింగ్స్, హిందుస్థాన్ కేబుల్స్ మన తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ పరి శ్రమలు. వీటిని పూర్తిగా మూసి వేసేం దుకు 2016లో మోడీ సర్కార్ ఫత్వాలు విడుదల చేసింది. మన పిచ్చిగానీ, లాభాల్లో ఉన్న బీపీసీఎల్నే బతకని వ్వని ప్రభుత్వం నష్టాల్లో వున్న వాటిని ఉద్ధరిస్తుందా?
- డిఫెన్స్ పబ్లిక్ రంగ పరిశ్రమైన భారత్ డైనమిక్స్ (బీడీఎల్) మిసైల్ టెక్నాలజీలో గుత్తాధిపత్యం గల సంస్థ. ఆకాష్, పృధ్వి, నాగ్ వంటివి దీని సృష్టే. ఇప్పుడు దీనికి పక్కలో బల్లెంలా ఎల్ అండ్ టీని, అదానీ కంపెనీని కూచోబెట్టింది కేంద్రం. ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యాల నుంచి సాంకేతిక పరి జ్ఞానాన్ని దిగుమతి చేసుకుని, లోయెస్ట్ కొటేషన్ వేస్తేనే కొద్దిగా ఊపిరంది బతక గల్గుతోంది బీడీఎల్.