Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితాలపై ఉత్కంఠ
- అంచనాలు తారుమారు
- 'కాసుల' పంపిణీపై చర్చోపచర్చ
- రెండో ప్రాధాన్యతా ఓట్లే కీలకం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఎడతెగని ఉత్కంఠకు కారణమవుతు న్నాయి. భారీ పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఒకింత ఆనందం, మరికొంత ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు తమదంటే తమదేనన్న ధీమాతో ఉన్న ఒకరిద్దరు అభ్యర్థులు ఇప్పుడు దీర్ఘాలోచనలో పడిపోయారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఉపాధ్యాయులు ఉత్సాహాంగా ఎన్నికల్లో పాల్గొని ఓటే యడం గమనార్హం. మహిళా టీచర్లు సైతం ఈసారీ ఓటేసేందుకు పోటీ పడ్డారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, కొన్ని సంఘాల నేతలు భారీగా ఖర్చు పెట్టడం చర్చోపచర్చలకు కారణమయ్యాయి. ఎన్నికల్లో టీఎస్‌యూటీఎఫ్ తరపున పాపన్నగారి మాణిక్‌రెడ్డి, పీఆర్టీయూ తరపు చెన్నకేశవరెడ్డి, ఇదే సంఘం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు, తపస్ నుంచి ఎవిఎన్ రెడ్డితోపాటు హర్షవర్థన్‌రెడ్డి తదితరులతో కలిపి మొత్తం 21 మంది బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులు భారీ బ్యాలెట్ పత్రాన్ని తయారుచేయాల్సి వచ్చింది. ప్రధాన అభ్యర్థులంతా ఆయా పోలింగ్ స్టేషన్లు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థులు క్యాంపులు ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ల ముందు తమ తరపున ఓట్లేయాలంటూ అను చరులను మోహరించారు. టెంట్లు వేసి మరీ పోల్‌చిట్టీలు అందించడమూ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 90.4 శాతం పోలింగ్ కావడం అందరికి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈనెల 16న జరగనుంది.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి తెప్పించుకుంటూ తమ పరిస్థితుల గురించి ప్రధాన అభ్యర్థులు అంచనావేసుకునే ప్రయత్నం చేశారు. కీలక సంఘంగా చెప్పుకునే అభ్యర్థి ఒకరు, ప్రయివేటు యాజ మాన్యం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి భారీగా ఉపాధ్యాయులను ప్రలోభపెట్టారనే ప్రచారం జరిగింది. వాహనాలను ఏర్పాటు చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు వరకు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో విందులు, వినోదాలు ఏర్పాటు చేయగా, రేపు అనగా భారీగా రూ. 2000 నుంచి రూ. 5000 వరకు డబ్బులు పంచారనే అరోపణలు, విమర్శలు వచ్చిన సంగతి తెలిసింతే. అలాగే అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాల్లో వచ్చాయని ఫిర్యాదులు అందాయి. అలాగే ఉపాధ్యా యులు కానోళ్లు ఓటేసేరంటూ ప్రసారమాధ్యమాల్లో కనిపించడం తెలిసిందే. అలాగే ప్రయివేటు స్కూల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యా యులు విద్యార్హతలు లేకుండా ఓటు వేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా మండలాల్లో ఉండే మండల విద్యాధికారులు కొందరు ప్రాథమిక పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులకు ఓటు వేసేందుకు దృవీకరించగా, మరికొందరికి తిరస్కరించారనే చర్చ నడిచింది. కాగా కొందరు తమ పలు కుబడిని ఉపయోగించి ప్రత్యర్థి సంఘాలకు చెందిన ప్రముఖ నాయకులు, ఉపాధ్యాయులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఓటు వేయకుండా 'డిలీటెడ్' జాబితాలో చేర్చారనే విమర్శలు చోటుచేసుకున్నాయి.
రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం
పోలింగ్ ముగిసే సమయానికి తాము కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం అభ్యర్థుల్లో లేకుండా పోయిందని సమాచారం. కొన్ని ఓట్లు చీలి పోవడం, మరికొంత మంది ఓటింగ్‌కే రాకపోవడంతో పున:రాలోచన లో పడ్డారు. రెండో ప్రాధాన్యత ఓట్లపైనే గెలుపోటములు ఆధారపడి ఉండ నున్నాయి. మొత్తం 27,700కుపైగా ఓట్లు ఉండగా, సోమవారం పోలింగ్ లో 26,861 మంది ఉపాధ్యాయులు ఓటేశారు. అంటే అభ్యర్థులెవరైనా విజయం సాధించాలంటే పోలైన ఓట్లల్లో తొలి ప్రాధాన్యత కింద కనీసం 13 వేల ఓట్లు రావాల్సి ఉంటుంది. కాగా, ఇప్పుడు పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఎవరికీ అన్ని ఓట్లు వస్తాయనే విశ్వాసం కనిపించడం లేదు. ప్రధాన సంఘాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు 6000 నుంచి 7000 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే అప్పుడు రెండో ప్రాధాన్యతకు పోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
28 టేబుళ్లు..
కౌంటింగ్ ఈనెల 16న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరగ నుంది. దాదాపు 26 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ మధ్యాహ్నాం తర్వాత ప్రారంభం కానుంది. అంతకు మందు ఓట్లను టాలీ చేసుకోవడం, కట్టలు కట్డడం తదితర అంతర్గత పనులు చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ సన్నాహాలతోపాటు భద్రతా ఏర్పాట్లు చేశారు.