Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికు కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కే.తారక రామారావు సోమవారం విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికి ఈ మేరకు మంత్రి కేటీఆర్ పలు వివరాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబారులో ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రారు మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు 15 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందనీ, ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్టు తెలిపారు. షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందనీ, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబారు ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంపై అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిందనీ, ఇక దుబారు రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని వివరించారు. ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలని కేటీఆర్ సూచించారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబారు రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక నాయకుల బృందం : కేటీఆర్
భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులన్నింటినీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా.బి.అర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు, నాలుగు నెలలపాటు విస్తతంగా చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు, జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక అమలుపైనా చర్చించాలనిసూచించారు.పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.