Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీ నియామకాలను కామన్ రిక్రూట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ను డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లును పెండింగ్లో పెట్టడం ద్వారా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు పట్ల విద్యార్థులు ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి , అధికారులు ఆమెను కలిసి బిల్లు గురించి వివరించినప్పటికీ ఉలుకూ పలుకూ లేకుండా నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్ళు చల్లేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో వివిధ శాఖల్లో 9.77 లక్షల ఖాళీలు ఉన్నట్టు పార్లమెంట్లో తెలిపిన కేంద్రం వాటిని భర్తీ చేయదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భర్తీ చేయనీయడం లేదని తెలిపారు. గవర్నర్ ఉద్దేశ పూర్వకంగానే యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును ఆపారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ఉండగా...
తెలంగాణలో తెస్తే తప్పేంటి?
వేరే రాష్ట్రాల్లో కామన్ రిక్రూట్మెంట్ విధానం అమల్లో ఉందనీ, అలాంటప్పుడు తెలంగాణలో దాన్ని తెస్తే తప్పేంటని టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని విమర్శించారు. ఢిల్లీ బీజేపీ నేతలు ఏం చెబితే గవర్నర్ అదే అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆ బిల్లు ఆమోదించక పోతే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు.