Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగే టీపీవో నియామక పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉపాధి కోసం పడిగాపులు కాస్తూ, పస్తులుండి సన్నద్ధమవుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీ వారి జీవితాలతో చెలగాటమా డుతుందని విమర్శించారు. కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లీకేజీల పరంపరను అడ్డుకోకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు. పరీక్షలు కూడా సమగ్రంగా నిర్వహించని టీఎస్పీఎస్సీ ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే టీపీవో పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీని ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని కోరారు.
సమగ్ర విచారణ జరపాలి : డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
పేపర్ లీకేజీ దారుణమనీ, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 80 వేల ఉద్యోగాల్లో భాగంగా వివిధ నోటిఫికేషన్లు జారీ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్న ఈ సమయంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ కొందరు ఉద్యోగులు పేపర్ లీకేజీకి పాల్పడడం సరైంది కాదని తెలిపారు. వివిధ నోటిఫికేషన్లకి సన్నద్ధమవుతున్న దాదాపూ 40 లక్షల మంది అభ్యర్థులను తీవ్ర ఆందోళనలో పడేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేసి లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అన్ని రకాల పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.