Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికల కోడ్ పూర్తి కాగానే 300 పడకలతో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి కొత్త బ్లాక్‌ను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం ఆయన నిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రుల పనితీరుపై నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ఎక్కువగా జిల్లాల్లో నిర్వహించాలనీ, కొత్తగా ప్రారంభించిన మాడ్యులర్ థియేటర్లు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమ్స్ అంతర్గత ఆన్లైన్ విధానా న్ని ప్రారంభించేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఐపీ, ఓపీ పేషెంట్ల వివరాలను విభాగాల వారీగా ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు. ఎమర్జెన్సీ పడకల నిర్వహణ మరింత మెరుగుపరచాలని సూచించారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం కలిసి యూకే వైద్య బృందం సహకారంతో చిన్నారులకు గుండె సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమని గుర్తుచేస్తూ, అవసరమైన వారికి చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సైతం అదే రోజు ఓపీ, కన్సల్టేషన్, పరీక్షలు, డాక్టర్ మెడికల్ అడ్వైస్ పూర్తయ్యేలా రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కోలియోసిస్ (గూని) సమస్య ఉన్నవారిని గుర్తించి.... మూడేండ్లలో 200 మందికి సర్జరీలు నిర్వహించిన నిమ్స్ ఆర్థో విభాగం వైద్య బృందాన్ని అభినందించారు. అవయవదాతలు, అవయవమార్పిడి శస్త్రచికిత్సల విషయంలో 2022 ఏడాదికి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందనీ, దీని వెనుక నిమ్స్ కృషి చాలా ఉందనీ, ఇందుకు కృషి చేస్తున్న జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత, డీఎంఈ, నిమ్స్ డైరెక్టర్‌కు అభినందనలు తెలిపారు. సమీక్షా సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్‌జే డైరెక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.