Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అడవుల్లోని పోడు భూములకు పట్టాలివ్వాలనే మెమోపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోడు భూముల క్రమబద్ధీకరణ చర్యలకు అనుమతించింది. ఆ చర్యలు చట్టం, నిబంధనలకు లోబడి ఉండాలని కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది. పోడు పట్టాల పంపిణీలో పలు అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. పోడు భూములకు నిబంధనలు పాటించకుండా పట్టాలివ్వడం చట్టవిరుద్దమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వ మెమో ఉందన్నారు. కాగా, పట్టాల పంపిణీని అడ్డుకోవద్దని కోరుతూ ఇందులో తుడుందెబ్బ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ, షెడ్యూల్ తెగల వారికి పథకాలు అందడం లేదన్నారు. కనీసం రోజుకు ఒక్కసారైనా పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో వారున్నారని చెప్పారు. పట్టాల పంపిణీ చేస్తే వారు ఆర్థికంగా నిలుదొక్కుకునే అవకాశం ఉంటుందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.