Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యలను నివారించాలి... లేకపోతే సమ్మె : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలనీ, ఆత్మహత్యలు నివారించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల రాజకీయ చదరంగంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమిధలవుతున్నారని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేయాల్సిన సెంట్రల్ ఫైనాన్స్ నిధులను విడుదల చేయకపోవడంతో వేతనాలతో పాటు, ఇజీయస్ స్కీంలో పని చేసే కూలీలకు సైతం బిల్లులు చెల్లించలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన స్టేట్ ఫైనాన్స్ నిధులను సైతం చెల్లించకుండా, ట్రెజరీల చెల్లింపులపై ప్రీజింగ్ విధించడంతో వేతన బకాయిల సమస్య తీవ్రతరమైందని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ క్రీడలో గ్రామపంచాయతీ కార్మికులను బలి చేయొద్దని కోరారు. వెంటనే రెండు ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి పెండింగ్ వేతనాలు చెల్లించాలనీ, ఈ చెల్లింపును ప్రీజింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నాలుగు నుంచి ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా బకాయిలు పెట్టారనీ, బకాయి వేతనాల కోసం అనేక ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో కార్మికులు అర్థాకలితో భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారనీ, వచ్చే అతి తక్కువ వేతనాలు కూడా సకాలంలో రాకపోవడంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12న ఆర్థిక ఇబ్బందులను భరించలేక కామారెడ్డి జిల్లా బీబీ పేట పంచాయతీ కార్యాలయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని కొంగరి బాబు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.