Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేయాలని పార్టీ నేతలను ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం వరకు 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. మిగతా 49 నియోజకవర్గాలలో వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎలాంటి అలసత్వం వద్దనీ, నిర్ణీత గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్ నుంచి పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు , ఇతర పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంటింటికీ టీడీపీకీ కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమం నిర్వహణలో ఆలస్యం చేయరాదని సూచించారు. ఎవరెవరు చొరవ తీసుకుంటున్నారు?.. ఎవరెవరూ సహకరించడంలేదో చెప్పాలంటూ ఆరా తీశారు. తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా అన్ని స్థాయిల నాయకులను సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యక్రమాన్ని అంతటా విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ అబ్జర్వర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లపై ఉందన్నారు. నిర్ధేశించిన మేరకు ప్రతి గ్రామం, బస్తీలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టడం, టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాల పంపిణీ, వార్డు స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయిలో పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పక్కగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.