Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం/మధిర
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుటాని తండా గ్రామపంచాయతీలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు రవీందర్ - సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్(5) గ్రామంలో ఆదివారం సాయంత్రం పిల్లలతో ఆడు కుంటుండగా వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. గమ నించిన స్థానికుల సమాచారంతో తల్లిదండ్రులు.. హుటా హుటిన, ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కి తరలించాలని సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్టీసీ బస్సులో వెళుతుండగా సూర్యాపేట సమీపంలో బస్సులోనే ఆ బాలుడు మరణించాడు. అక్కడ నుంచి ఆ బాలుడిని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు కలుముకున్నాయి. వీధి కుక్కలను చూసి గ్రామస్తులు ముఖ్యంగా పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు.
చిన్నారిపై వీధి కుక్కల దాడి
మధిర మున్సిపాలిటీలోని జిలుగుమాడులో సోమవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేండ్ల చిన్నారి దోర్నాల వివేక్‌పై వీధి కుక్కలు వెంటపడి దాడి చేసి చేతిని గాయపరిచాయి. గమనించిన బాలుని తండ్రి దోర్నాల రాము.. కుక్కలను తరిమి కొట్టి తన కుమారుడిని రక్షించుకున్నాడు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. గ్రామంలో అనేక సంఖ్యలో వీధికుక్కలు తిరుగుతున్నాయని, బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని, వెంటబడి తరిమి కరుస్తున్నాయని తెలిపారు.