Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తికోసం కూతుర్ల ఘాతుకం?
- అర్ధరాత్రి వేళ.. పోస్టుమార్టం
- ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల నిరసన
నవతెలంగాణ-రాజంపేట్
ఆస్తికోసం కూతుర్లు దారుణానికి ఒడిగట్టారు. కన్నతండ్రి అని చూడకుండా ఏకంగా సజీవ దహనం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులుకు (70) ముగ్గురు కూతుర్లు. కొడుకు కొన్ని రోజుల కిందట తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య కూతుళ్లు సరిగ్గా చూసుకోకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న ఆంజనేయులు.. కొన్ని రోజులుగా రెండో భార్యతోనే ఉంటున్నాడు. కాగా, కొద్దిరోజులుగా మొదటి భార్య కూతుర్లు తమకు ఆస్తి ఇవ్వాలని ప్రతిరోజూ గొడవ చేస్తున్నారు. ఆదివారం చిన్న కూతురు బిడ్డ వివాహ విందు కార్యక్రమం జరగగా ఆదివారం మధ్యాహ్నం సమయంలోనే తండ్రిని చంపి ఇంటికి తాళం వేసి పథకం ప్రకారం వివాహం విందుకు వెళ్లినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వివాహ విందు నుంచి వచ్చిన అనంతరం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టినట్టుగా గ్రామస్తులు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చేశారు. మాంసం ముద్దతో ఉన్న ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీశారు. తల, మొండెం వేరువేరుగా ఉండటంతో హత్య చేసినట్టు ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. కాగా అర్ధరాత్రి సమయంలో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడంపై గ్రామస్తులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఎస్ఐని విధుల నుంచి వెంటనే తొలగించాలని మృతుని ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. సంఘటనపై ఎస్ఐని సస్పెండ్ చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు, కులస్తులు ఆందోళన విరమిం చారు. కాగా మృతుని అన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.