Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం కార్యాలయంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వచ్చేనెల ఐదున నిర్వహించబోయే ఛలో ఢిల్లీ పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని తెలిపారు.దీంతో అప్పుల పాలెనౖ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి మోడీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించే చర్యలో భాగంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉచిత కరెంటు లేకుండా చేయడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కష్టాల్లోకి నేడుతున్నదని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలనీ, 60 ఏండ్లు పైబడిన వారందరికీ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యా వసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలనీ, అటవీ పరిరక్షణ చట్టం సవరణల్లోని నిబంధనలు ఉపసహరిం చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిం చాలనీ, ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్‌ను విస్తరించి రోజుకు రూ.600 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను చెల్లించాలనీ, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయు కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెన్షన్ రూ.10వేలు చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అగ్ని పథ్ స్కీమును రద్దు చేయాలని, కాంట్రాక్టు పద్ధతిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర నాయకులు శోభన్ మూడ్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.