Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్ట్ పద్ధతిలోనే బోధనా సిబ్బంది
- వయోపరిమితి దాటిపోతున్న వైనం
- ఆయుర్వేద పీజీల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆయుర్వేద విద్యను అభ్యసించిన వారు వేలాది మంది ఉన్నా ఏండ్ల తరబడి పోస్టుల భర్తీ మాత్రం చేయడం లేదు. ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కలిసిన ప్రతి ఒక్కరూ ...చూద్దాం...చేద్దామంటూ కాలం వెళ్లదీస్తుండటమే తప్ప ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు పోస్టులు ఖాళీగా ఉండి, వాటి భర్తీకి ఆర్థికశాఖ నుంచి ఆమోదం ఉన్నప్పటికీ వాటిని మాత్రం కాంట్రాక్ట్ ప్రాతిపదికనే కొనసాగిస్తున్న అధికారుల తీరుతో ఆవేదన చెందుతున్నారు. గతంలో లేని వయోపరిమితి సడలింపునిచ్చినా నోటిఫికేషన్ వేయకపోవడంతో ఇచ్చిన సడలింపు కూడా వారికి ఉపయోగపడే పరిస్థితి లేదు. ఆయూర్వేద వైద్యవిద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు రెగ్యులర్గా టీచింగ్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రెండు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలున్నాయి. వీటిలో చదివే వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పీజీ పూర్తి చేసుకున్న వారు రాష్ట్రంలో దాదాపు 2,000 మంది వరకున్నారు.
అయితే గత 12 ఏండ్ల నుంచి నేరుగా నియామకాలు లేకపోవడంతో వాటి కోసం ఇప్పుడా...అప్పుడా అని ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నది. 2008లో పోస్టుల భర్తీ కోసం అప్పటికి పీజీలు అందుబాటులో లేరనే కారణంతో వన్ టైం ఆప్షన్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్లను నాన్-టీచింగ్ సైడ్ నుంచి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ కన్వర్షన్ను అక్కడితోను ఆప కుండా ప్రభుత్వం మరో రెండు సార్లు అదే విధంగా 2010, 2012లో కన్వర్షన్ను చేసింది. అయితే మరోసారి అలాంటి ప్రయత్నం చేయకుండా ఆశావహ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి నిలుపు దల చేయించారు. అయితే రాష్ట్రంలో ఉన్న 36 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను గతేడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. ఏడాది గడుస్తుండగా మరోసారి ఆ పోస్టులను రెన్యూవల్ చేయించుకు నేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో అభ్యర్థు లు ఆందోళన చెందుతున్నారు. నేరుగా పోస్టు లను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే వయోపరిమితి దాటుతుండటంతో వీరిలో చాలా మంది అభ్యర్థులకు మరో అవకాశం కూడా పోతోం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు, పీజీ అభ్యర్థుల కోసమే కాకుండా రెగ్యులర్ పోస్టుల భర్తీ ద్వారా ఆయుర్వేద వైద్యవిద్యను బలోపేతం చేసేందుకు వీలుగా పోస్టులను రెగ్యులర్ ప్రాతిప దికన భర్తీ చేయాలని ఆ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు.