Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్కార్ అవార్డు పట్ల సీఎం కేసీఆర్ హర్షం
- తమ్మినేని, కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ,ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, ఆ పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత చంద్రబోస్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాణ విలువలపరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజనీ, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదనీ, కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భం గా గుర్తు చేశారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలనీ, వైవిధ్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.
ఆస్కార్ విజేతలకు అభినందనలు : సీపీఐ(ఎం)
మన దేశానికి చెందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఒరిజినల్ పాట కేటగిరీలో ''నాటు నాటు'' పాటకు, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు లభించిన నేపథ్యంలో చిత్ర బృందానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2009 తరువాత రెండు అవార్డులు గెలుచుకోవడం, అందునా తెలుగు సినిమాకు మొదటిసారి ఆస్కార్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, మంత్రులు కె.తారకరామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయా కర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రవిచంద్ర, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ కుమార్, సౌత్ సేన ప్రతినిధులు రవి, శ్రీనివాస్, శ్రీకాంత్, రమేష్ బాబు, విలియం కేర్, జగదీష్ శుభాకాంక్షలు తెలిపారు.