Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 9న మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుల ఉమ్మడి సమావేశం
- ఉభయ కమ్యూనిస్టు పార్టీల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐక్యంగా ముందుకు సాగుదామని సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు నిర్ణయించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల శ్రేణులందరిలో ఉమ్మడి రాజకీయ అవగాహన, ఐక్య కార్యాచరణ స్ఫూర్తిని నింపే విధంగా వచ్చేనెల తొమ్మిదో తేదీన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల ఉమ్మడి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ఈ సమావేశానికి ఆయా పార్టీల అఖిల భారత కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి రాజాలతోపాటు కేంద్ర నాయకులు బివి రాఘవులు, కె నారాయణను ఆహ్వానించాలని నిర్ణయించాయి. ఆదివారం ఎంబీ భవన్లో జరిగిన సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల రాష్ట్ర నాయకత్వ సమావేశానంతరం ఉభయ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు, బాధ్యతల గురించి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరింత దృఢంగా ఐక్యంగా వ్యవహరించాలని నిర్ణయించామని వివరించారు. ఈనెలలో సీపీఐ(ఎం), ఏప్రిల్, మేలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించబోయే ప్రచారోద్యమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర పార్టీలు విడిగా పిలుపులిచ్చినప్పటికీ పరస్పరం సంఘీభావాలు, సహకారంతో రాష్ట్రంలో ఈ ఉద్యమం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు కృషిచేస్తూ పొత్తులు, ఎత్తులలో ఉభయ కమ్యూనిస్టులు ఐక్యంగా వ్యవహరించాలని సమావేశం అభిప్రాయపడిందని వివరించారు. ఈ సమావేశంలో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) నుంచి చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జాన్వెస్లీ, పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు.