Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో అధికారం కోసం రాజకీయంగా దిగజారిన కాషాయ పార్టీ: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- మాడుగులపల్లిలో సీపీఐ(ఎం) కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ -వేములపల్లి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని, దేశానికి ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడానికి రాజకీయ వ్యభిచారానికి సిద్ధమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మించిన సీపీఐ(ఎం) కార్యాలయ భవనాన్ని మంగళవారం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ.. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. దేశాన్ని రావణ కాష్టంలా మార్చాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉందని.. ఈ ప్రమాదాన్ని కమ్యూనిస్టులు గుర్తించారన్నారు. తెలంగాణలోనూ అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ నాయకులకు బలంగా పనిచేయాలని, వివిధ పార్టీల నాయకులను లొంగదీసుకోవాలని చెప్పారని, వారికి కాంట్రాక్టులు, డబ్బులు వంటి వాటిని ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలతో బీజేపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని, మిగిలిన వారు రెండో తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని ప్రశ్నిస్తున్నారని తప్పు చేయకున్నా తప్పు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే కవితపై దాడి చేస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిందన్నారు. బీజేపీిని గద్దెదించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుండటం వల్లే కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం గుట్టు, బండారం బయట పెట్టడానికి సీపీఐ(ఎం) 33 జిల్లాల్లో 15 రోజులపాటు జన చైతన్య యాత్ర నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా ఉద్యమ శక్తిగా ప్రాముఖ్యమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. సీపీఐ(ఎం) కార్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా పోరాటాలకు నిలయంగా నిలవాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీపీఐ(ఎం) పాత్ర ఎంత అవసర ముందో మునుగోడు ఎన్నికలు తెలిపాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, గోవర్థన, నాయకులు గౌతమ్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.