Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటిఆయోగ్ చెప్పినా మోడీ 'నో'
- కాళేశ్వరం,పాలమూరుకు ఉత్తచెయ్యి
- బీజేపీ రాష్ట్రాలకే వితరణ
- ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నరాష్ట్రాల్లో ప్రాజెక్టులు, పథకాలకు నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నది. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పదే పదే సీఎం కేసీఆర్ గొంతు చించుకున్నా, మోడీ మనస్సు కరగ లేదు. ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటైన నిటిఅయోగ్ సైతం తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటును అందిం చాలని సూచించినా, మోడీ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ నుంచి పోయే పన్నులెక్కువ కాగా, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే
నిధులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. రాష్ట్రానికి సాధారణ కేటాయింపులు సైతం అత్తెసరే. గత కేంద్ర బడ్జెట్టే ఇందు సాక్ష్యం. సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు చూపలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిధులు రాకపోవడం గమనార్హం.
బి.బసవపున్నయ్య
ఈ ప్రాజెక్టులకు ఉత్తచెయ్యి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాల మూరు - రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు లతో పాటు మిషన్ భగీరథ, ఇతర పథకాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలంటూ పలు మార్లు స్వయంగా సీఎం, మంత్రులు ప్రధాని మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులనూ కలిశారు. పదే పదే వినతులూ ఇచ్చారు. అయినా కేంద్రం కనికరించలేదు. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి రాష్ట్రాల ఆదాయాన్ని తన నియంత్ర ణలోకి తీసుకుని సమాఖ్య స్వభావాన్ని దెబ్బతిసింది. కేంద్రం ఇవ్వక పోగా, అప్పు లు చేయడానికి సైతం ఎఫ్ఆర్బీఎం నిబంధనల పేర ఆటంకాలు సృష్టిస్తున్నది. గత మూడేండ్లుగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా మొండిచెయ్యే చూపుతున్నది. నీటిఅయోగ్ సైతం మిషన్ కాకతీయకు రూ.5000 కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19000 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా చెత్తబుట్టలో పడేసింది.
కేంద్రం సహాయ నిరాకరణతోనే అప్పులు
రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా సాగునీటి పథకాలకు భారీగా నిధుల కేటాయింపులు చేస్తూ వస్తున్నది. అయితే కేంద్రం సహాయ నిరాకరణతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. 2014-15 నుంచి 2022-23 దాకా 153508.97 కోట్లు కేటాయించి, రూ.118647.48 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెచ్చుకోవాల్సి వస్తున్నది. బడ్జెటేతర రుణాల ను సైతం తెస్తున్నది. కాళేళ్వరం కార్పొరేషన్, పాలమూరు ఎత్తిపోతల, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర కార్పొరేషన్ల ద్వారా అప్పులు సమ కూర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 2015 -16 సంవత్సరానికి రూ.80,190.46 కోట్లుగా అంచనా వేయగా, 2020-21లో ఈ అంచనాలు రూ.105790.72 కోట్లుగా పెంచారు. దాదాపు రూ. 25000 కోట్లు అధికమైంది. 2020 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.63,541.70 కోట్లు. ఇందులో బడ్జెట్ నుంచి రూ.23901.66 కోట్లు ఖర్చు చేశారు. మిగతావి కార్పొరేషన్ ద్వారా రూ.39,640.04 కోట్లు రుణాలు తెచ్చుకున్నవే. కాగా ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మొత్తం బడ్జెట్ నుంచి రూ.59,413.30 కోట్లు ఖర్చు పెట్టాలని భావించారు. అలాగే రూ. 46377.42 కోట్లు రుణాలు తేవాలని భావిస్తున్నది.
అప్పర్‌భద్రకు రూ.5,300 కోట్లు
త్వరలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డికి మాత్రం జాతీయ హోదా ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. పైగా అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోకి తోసేసింది. అప్పర్‌భద్రకు మాత్రం ఆఘమేఘాల మీద కేంద్ర జలసంఘం ఆమోదం తెలపడం, అంతే వేగంగా జాతీయ హోదా ఇవ్వడం జరిగిపోయాయి. అప్పర్‌భద్ర నుంచి వచ్చే నీటి ప్రవాహంతో శ్రీశైలం మీద ప్రభావం పడుతుందని తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. కేంద్రం వివక్షకు ఇంతకుమించిన ఉదాహరణేం కావాలి ?
కెన్-బెట్వాకూ అంతే..
నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన కెన్-బెట్వా ప్రాజెక్టుకు సైతం కేంద్రం రూ.3,500 కోట్లు కేటాయించింది. దీంతో బీజేపీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఆయకట్టుకు నీరందు తుంది. ఈ పథకానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంది. ఐదారేండ్లల్లో రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద మహారాష్ట్రంలోని విదర్భ ప్రాంతంలోని ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కేటాయించారు. ఏఐబీపీ కింద 50 ప్రాజెక్టులకు రూ.3,122 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిం చారు.ఇందులో తెలంగాణకు మాత్రం రిక్తహస్తమే చూపుతున్నారు.
మళ్లీ అప్పులే
యాక్సీలరేటేడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్ (ఏఐబీపీ) కింద వచ్చే నిధులకూ కేంద్రం కోత పెట్టింది. గతంలో ఈ పథకానికి రూ. 4000 కోట్లకుపైగా వచ్చేవి. ఇప్పుడు వాటిని రూ. 2000 కోట్లకు కుదించింది. ఏఐబీపీ పథకం కూడా యూపిఏ సర్కారు చేపట్టిన పథకమే కావడం గమనార్హం. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సర్కారుకు సవాల్ కానుంది. మళ్లీ అప్పులు తెచ్చుకోకతప్పదని ఆర్ధిక శాఖ అధికారులు అంటున్నారు.
రూ.1.50 లక్షల కోట్లు కావాలే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. ప్రభుత్వ అంచనా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 80 వేల కోట్లు అవసరం. ఇప్పటివరకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 40 వేల కోట్లు కావాల్సిందే. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు కూడా రూ. 80 వేల కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటికీ రూ. 20 వేల కోట్లు పెట్టారు. ఇంకా రూ. 60 వేల కోట్లు తప్పనిసరి. సీతారామాసాగర్ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కావాలి. ఇకపోతే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు మరో రూ. 4000 కోట్లు అవసరమని అధికారుల చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకుగాను ప్రతియేటా ఏడు నుంచి తొమ్మిది శాతం మేర వడ్డీ చెల్లిస్తున్నది.
వచ్చే రెండేండ్లల్లో పూర్తికాకపోతే..
ఈ ప్రాజెక్టులు వచ్చే రెండేండ్లల్లో పూర్తి చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. నిధులు విడుదల చేసి సకాలంలో పనులు ముగించకపోతే అంచనా వ్యయాలు మరింత పెరగనున్నాయి. ఎస్ఎస్ఆర్ రేట్లూ అధికమవు తాయి. అదనపు ఆర్థిక భారాలను అడ్డుకోగలం.
పోరాటం చేయాల్సిందే
రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, ప్రాజెక్టులకు నిధుల విషయమై పోరాటం చేయాల్సిందే. ఇది పలు రకాలుగా ఉండాలి. ప్రజా ఉద్యమం ఒకటైతే, న్యాయపోరాటం మరోకటి. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు నియామకాల కోసం. ఇప్పుడు నిధులు, నీళ్ల విషయంలో రాజీపడొద్డు. కేంద్రం మెడలు వంచి మరీ సాధించుకోవాలి. అప్పుడే తెలంగాణకు సార్థకత.
- బి. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి,రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్స్ అసోసియేషన్
మేమే కేంద్రానికి ఇస్తున్నాం : రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది. గత ఏనిమిదేండ్ల కాలంలో దాదాపు రూ. 3. 5 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే, తిరిగి వచ్చింది. రూ. 1.5 లక్షల కోట్లు కూడా లేవు. అలాగే ఆయా పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 45 వేల కోట్లను కేంద్రం అపేసింది. బోరుబావులకు మీటర్లు పెట్టడం లేదని ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలోపు రూ. 30 వేల కోట్లు ఇవ్వలేదని ఇటీవల సంగారెడ్డిలో వ్యాఖ్యానించారు.