Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒంటెత్తు పోకడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- చేరికల కమిటీకీ ఈటల రాజీనామా?
- ఎడమొహం పెడమొహంగానే ఇతర నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆట్..ఊట్.. అంటూ హడావిడి చేస్తున్న బీజేపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బండి ఒంటెత్తు పోకడ ఆ పార్టీలోని నేతలకు దూరం పెంచుతున్నది. అది ఆయనపై మూకుమ్మడిగా దాడిచేసేందుకు ఊత మవుతున్నది. అమిత్‌షా, నడ్డా జోక్యం చేసుకున్నా పంచాయితీ తెగకుండా చిక్కుముడిగా మారుతుందనే ప్రచారం జరుగుతున్నది. బండి సంజయ్ అంతా నాయిష్టం.. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడం, ఎక్కడికెళ్లినా మీడియాలో తానే హైలెట్ కావాలనే ఆయన ధోరణితో మిగతా నేతలు తలలు పట్టుకుంటున్నారు. మీడియా సమావేశాల్లో బండితో పాటు కొందరే కూర్చోవటం దానికి ఊతమిస్తున్నది. కనీసం తమ హోదాకు తగ్గట్టు పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొందని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. బండి ఇతర నేతలెవ్వరూ హైలెట్ కాకుండా తొక్కిపెడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయి బలోపేతం దేవుడెరుగు రాష్ట్ర కేంద్రంలోనే ఒక నేతకు మరో నేతకు అస్సలు పొసగని పరిస్థితి నెలకొంది. అతిగా ఊహించుకుని బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఎందుకు చేరానురయ్యా? అని పశ్చాతాపపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పెద్దగా కలిసిపోవడం లేదు. పార్టీ అధిష్టానం అప్పగించిన చేరికల కమిటీ చైర్మెన్ పదవీ నాకొద్దంటూ అధిష్టానానికి ఖరాకండిగా తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన వాగ్దాటితో అసెంబ్లీలో అధికార పార్టీలను ఇరుకునపెట్టిన ఈటల రాజేందర్‌ను కనీసం బీజేపీ ఎల్పీ నేతగా ఆ పార్టీ నియమించలేని పరిస్థితి ఉంది. పదవి ఇస్తే సరిపోదు..స్వేచ్ఛ కూడా ఇవ్వాలనే ఆయన మాటకు ఆ పార్టీలో విలువే లేకుండా పోయింది. ఏ హామీ కూడా ఇవ్వకుండా ఇతర పార్టీల నాయకులు బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపడటం లేదు. ఆలూ లేదు..సూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్న చందంగా పార్టీకి పట్టులేకున్నా సీట్ల కోసం ఇప్పటి నుంచే కొట్లాడుతున్న పరిస్థితి గ్రూపులకు దారితీస్తున్నది. పాత బీజేపీ నాయకులకు, కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య పరిస్థితి ఎడమొహం పెడమొహంలాగానే ఉంది. ఎక్కడా కలిసిపోని పరిస్థితి. నలుగురు ఎంపీలుంటే ఎవరి దారి వారిదే. ముగ్గురు ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత ఎవరనే విషయాన్ని ఇప్పటిదాకా తేల్చలేదంటనే ఆ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కవిత అంటేనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
ఒంటికాలిమీద లేస్తారు. అలాంటి అరవింద్...కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించి బాంబు పేల్చారు. ఇంకో అడుగు ముందుకేసి ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వారిద్దరి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను ఎత్తిచూపుతున్నది. ఈటల రాజేందర్‌కు, బండిసంజయ్‌కి అస్సలే పొసగడం లేదు. పార్టీలో ఈటలను ఒంటరిని చేసేందుకు బండి వెనుక నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారముంది. ఇది పసిగట్టిన ఈటల రాజేందర్ బండిపై ఆగ్రహంతో ఉన్నారు. వివేక్ తనపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఈటల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. బండి, కిషన్‌రెడ్డి, తదితర నాయకులతో ఉన్న విభేదాల వల్ల రాజాసింగ్ అయితే పార్టీ ఆఫీసు వైపే సరిగా రావడం లేదు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన బీజేపీలో ఉంటాడా? బయటకు పోతాడా? అనే అనుమానం వ్యక్తమవుతున్నదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.