Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంగార్డులకు గుర్తింపేది..?
- 30 ఏండ్ల సర్వీస్ ఉన్నా అక్కడే..
- హెల్త్‌కార్డు, బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వర్తించవు
- చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న వైనం
(ఇ.రత్నాకర్)
'ఏ పోలీస్స్టేషన్కెళ్లినా గుమ్మం ముందు వారే ఉంటారు. పొద్దస్తమానం ఎండలో నిలబడతారు. పెద్దసార్ల నుంచి కానిస్టేబుళ్ల దాకా ఆఫీసులో ఏ అవసరమొచ్చినా ఠక్కున గుర్తొచ్చేది వారే. 'ఏరు ఇటురా? చారు తేపో... టిఫిన్ తేపో.. కోర్టుకెళ్లి ఈ కాఫీలు ఇచ్చిరా.. సమన్లు అందించి రాపో...' అని వచ్చే ఆదేశాలకు ''ఎస్ సార్'' అంటూ తలొగ్గాల్సిందే. ఇలా గొడ్డుచాకిరీ చేసినా ఛీత్కారాలు తప్పవు. పేరుకే ఒంటిపై యూనిఫామ్గానీ దక్కే గౌరవం అంతంతే. ఏండ్లుగా పర్మినెంట్ చేస్తారనే ఆశగా ఎదురుచూసినా చివరకు నిరాశే ఎదురవుతోంది. రిటైర్ అయితే ఒట్టి చేతులతో ఇంటికెళ్లాల్సిందే. ఇదీ రాష్ట్రంలోని హోంగార్డుల దుస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది హోంగార్డులు ఉన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇలా ఉన్నత చదువు చదివినవారే. వీరు సివిల్, ట్రాఫిక్, క్లూస్‌టీమ్, తదితర విభాగాల్లో తమ సేవలను అందిస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లుగా, ఆపరేటర్లుగా, బందోబస్తులు, నైట్ డ్యూటీలు, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్లు, రికార్డుల మేయిం టనెన్స్లలో కీలక పాత్రపోషిస్తున్నారు. టీ అందించడం దగ్గరి నుంచి టప్పాలు, సమన్లతోపాటు అన్ని సేవలూ చేస్తున్నారు. హోంగార్డు ఇచ్చిన కీలక సమాచారం తో ఎన్నో సంచలనమైన కేసులు ఛేదించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇంత చేసినా వీరి శ్రమకు తగ్గ గుర్తింపు దక్కట్లేదు. కానిస్టేబుళ్లకు వర్తించేవి ఏవీ వారికి దక్కట్లేదు. 2006కు ముందు.. రోజుకు రూ.75 చొప్పున నెలకు రూ.2,200 వేతనం ఇచ్చేవారు. అనేకసార్లు వినతులు ఇవ్వగా 2009 నాటికి రూ.6 వేలకు పెంచారు. 2014లో రూ.12వేలకు, 2018లో రూ.18వేలకు పెంచారు. ఏడాదికి వెయ్యి రూపాయల వేతనం పెంచు తామనీ రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చి అమలు చేస్తున్నది. పీఆర్సీ అందరిలాగా కాకుండా కేవలం రూ.20 వేలకే లెక్కగట్టి పెంచింది. దీంతో వారికి రూ.27,500 వేతనం దక్కుతు న్నది. ఈ వేతనం విషయం ఒక్కటే కొంత సానుకూల అంశం. వీరికి సెలవులు ఇవ్వడం లేదు. ఒక్కరోజు హాజరు కాకపోయినా వేతనంలో కోత విధిస్తున్నారు. దీంతో పెండ్లి, శుభకార్యాలకు, చావులకు, వ్యక్తిగత అవసరాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
రిటైర్డ్ అయితే ఒట్టి చేతుల్తోనే ఇంటికి..
డిపార్టుమెంట్లో హోంగార్డులుగా 30, 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా ప్రమోషన్లు ఎరుగరు. సెక్యూరిటీ గార్డులకు కూడా రిటైర్మెంట్ సొమ్ము అందుతున్న తరుణమిది. హోంగార్డులు మాత్రం ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నారు. హెల్త్ కార్డులులేవు. పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సదుపాయం అందట్లేదు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే మాత్రమే ఆ సమయంలో బీమా సంస్థ నుంచి రూ.5లక్షలు బాధిత కుటుంబానికి చెల్లిస్తున్నారు. గుండెజబ్బులు, క్యాన్సర్ లేదా వివిధ దీర్ఘకాలిక రోగాలు, వివిధ కారణాలతో మృతిచెందితే అంతే సంగతులు. బాధిత కుటుంబం రోడ్డున పడాల్సిందే. డిపార్టుమెంట్ నుంచిగానీ, ప్రభుత్వం నుంచిగానీ ఒక్క రూపాయి చెల్లించరు. తోటి హోంగార్డులే చందాలు వేసుకుని బాధిత కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు.
హామీలు బుట్టదాఖలు..
పోలీస్ శాఖలో హోంగార్డులకు మంచి గుర్తింపు ఇస్తామని, పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం మాటలు నీటబుడగలయ్యాయి. ఆరోగ్య భద్రత కల్పిస్తామన్న హామీలు మరుగునపడ్డాయి. ఐదేండ్లు పూర్తి చేసిన హోంగార్డులకు వయస్సుతో సంబంధం లేకుండా(ఎస్పీఓ) స్పెషల్ పోలీస్ అసిస్టెంట్‌గా లేదా సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా, పీటీఓ డ్రైవర్లుగా, ఏఆర్గాగానీ, తెలంగాణ స్పెషల్ పోలీస్‌గా గుర్తించాలని, లేదా ఎస్పీఎఫ్లో విలీనం చేయాలని గతంలో హోంగార్డు నాయకులు ఉన్నతాధిóకారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయమైన డిమాండ్లను పరిశీలిస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. ఎన్నో సార్లు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులతోపాటు తెలిసిన వారికల్లా మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రాబోయే ఎన్నికల్లోపైనా తమకు మంచి రోజులొస్తాయని హోంగార్డులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వంపై ఎన్నోఆశలు పెట్టుకున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కానిస్టేబుళ్లతో సమానంగా డ్యూటీలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని హోంగార్డులు మనవి చేస్తున్నారు. తమ సహచరులు చనిపోతే ఎంతో కొంత వేసుకుని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసుకుం టున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్యబీమా, హెల్త్‌కార్డు సదుపాయాన్ని కల్పించాలని పలువురు హోంగార్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
హోంగార్డుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హోంగార్డులకు సరైన గుర్తింపు లేదు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. రేయనకా పగలనకా రోడ్లమీద గొడ్డుసాకిరీ చేస్తున్నారు.
ప్రభుత్వ సేవల్లో, అధికారిక కార్యక్రమాల్లో హోంగార్డులు సేవలందిస్తున్నారు. అయినా వారికి ఉద్యోగ భద్రత లేదు. వారి సేవలను గుర్తించి ప్రమోషన్లు కూడా వర్తింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వేలాది మంది కుటుంబాలు ఆధారపడిన హోంగార్డుల సమస్యలను గుర్తించి, వారితో చర్చించాలి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగ భద్రతను, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు తదితర సౌకర్యాలు కల్పించాలి.
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్