Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారల్ మార్క్స్ 140 వర్థంతిలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాలు, వర్గ సంఘర్షణలు తీవ్రమయ్యాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపెట్టడం మార్క్సిజం వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్క్స్ రచనలను మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో కారల్ మార్క్స్ 140వ వర్థంతి సభను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. మార్క్స్ చిత్రపటానికి రాఘవులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలో వర్గ సంఘర్షణలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. అయితే, అవి యుద్ధం, వ్యాపారం, ఆర్థికం, తదితర రూపాల్లో ఉంటాయని చెప్పారు. ప్రపంచంపై మరింత పట్టు సాధించేందుకు పెట్టుబడిదారీ దేశమైన అమెరికా యత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే విపరీత సహజవనరులున్న రష్యాను నాటో దళాల ద్వారా దెబ్బతీసేందుకు యత్నిస్తున్న తీరును వివరించారు. అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్న చైనాను సాంకేతికంగా దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు. అయితే, చాలా దేశాలు అమెరికా మాట వినట్లేదనీ, కొన్ని ఎదురు తిరుగుతున్నాయని చెప్పారు. డాలర్‌తో కాకుండా తమ దేశాల కరెన్సీలతో వ్యాపారాలు చేసేందుకు ఆయాదేశాలు మొగ్గుచూపుతున్నాయన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఫైనాన్స్ క్యాపిటల్‌కు ఉన్నప్పటికీ అది ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిపారు. కార్మికవర్గం, విప్లవశక్తులు దాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో లేవన్నారు. అయితే, దాన్ని సాధించేందుకు వందేండ్లయినా పట్టొచ్చు...వంద నిమిషాల్లోనైనా అయిపోవచ్చని చెప్పారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాలు సంక్షోభాలను అరికట్టే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నప్పటికీ ఫైనాన్స్ పెట్టుబడి దానికి అంగీకరించబోదన్నారు. ఊహాజనిత వ్యాపారం నీటిబుడగ లాంటిదనీ, అది ఎప్పుడైనా పగిలిపోవచ్చునని చెబుతూ అదానీ, యూఎస్‌లో రెండు బ్యాంకులు దివాళా తీసిన తీరును వివరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నర్సింహారావు, చుక్కరాములు, పాలడుగు భాస్కర్, టి.సాగర్, అబ్బాస్, పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.