Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవరించిన చైర్మెన్, కార్యదర్శిని తొలగించాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-1 పరీక్ష కూడా లీకైనట్టుగా వార్తలొస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నియామకాల్లేక ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇలాంటి చర్యలతో తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి, విలువైన సమయం కేటాయించి లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారని వివరించారు. టీఎస్ పీఎస్సీలో ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌తోపాటు సభ్యుల పాత్రపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చైర్మెన్‌ను తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
అన్ని పరీక్షలపై విచారణ చేయాలి : ఏఐఎస్ఎఫ్
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ అధికారులు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ చైర్మెన్, సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులతో చెలగాటం : పీడీఎస్‌యూ
పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి విజరుఖన్నా ఇడంపాక విమర్శించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.