Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నలకి కేంద్రమంత్రి చెప్పిన సమాధానంపై ఎర్రబెల్లి తీవ్రంగా స్పందించారు. పేదల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తున్నదని విమర్శించారు. గడిచిన రెండేండ్లలో కేంద్రం బడ్జెట్లోనే ఉపాధి హామీకి 55 వేల కోట్ల రూపాయల కోతను విధించడం దారుణమని పేర్కొన్నారు. దీంతో ఉపాధి హామీ చట్టం కింద పేదలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయని వాపోయారు. మెటీరియల్ కాంపోనెంట్ కూడా తరిగిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోనూ అనేక ఆంక్షలు పెట్టిందని విమర్శించారు.