Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న మానుకోటలో భారీ బహిరంగ సభ
- సభ విజయవంతానికి సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం : కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య వెల్లడి
నవతెలంగాణ-మహబూబాబాద్
మతోన్మాద బీజేపీ ఫాసిస్టు కార్పొరేట్ విధానాలను ప్రతిఘటించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 17 నుంచి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని, 17న మానుకోటలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్‌లోని పెరుమాండ్ల జగన్నాథం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ తొమ్మిదేండ్లుగా దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుందని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బయ్యారం ఉక్కు ఖనిజంలో నాణ్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే దళిత, గిరిజన ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అన్నారు. పూర్తిగా గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాలో కనీసం గిరిజన యూనివర్సిటీ కూడా నోచుకోలేదని అన్నారు. 2014లో రూ.1700 కోట్లు ఉన్న అదానీ ఆదాయం ఇప్పుడు రూ.16లక్షల కోట్లకు పెరగడానికి మోడీ కార్పొరేట్ విధానాలే కారణమని తెలిపారు. ఆదానీ మూలంగా ఎస్బీఐ, ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ సంస్థలు మునిగిపోయే పరిస్థితికి వచ్చిందని ఆరోపించారు. దేశంలో ధరల పెరుగుదల, గ్యాస్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానంటు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల తగ్గించి మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయ పన్నును పెంచారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ 9 ఏండ్లలో 1800 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు సంస్థల్లో ఉన్న బ్లాక్ మనీని తీసుకుని వచ్చి ప్రతి ఒక్క నిరుపేద బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు ఇస్తానని చెప్పి రూ.15 కూడా వేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ నేతలు గోతి కాడి నక్కలాగా కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే దేశ సంపద రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మతోన్మాద శక్తులైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం సీపీఐ(ఎం) నిర్వహించే జన చైతన్య ప్రజా యాత్ర ఈనెల 17న వరంగల్‌లో ప్రారం భమవుతుందని తెలిపారు. 17న ఉదయం 10 గంటలకు వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు.
అదేరోజు వెయ్యి ద్విచక్ర వాహనాలతో మానుకోటకు జాత చేరుకుంటుందని, సాయంత్రం 5 గంటలకు తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతారని తెలిపారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతున్నదని తెలిపారు బీజేపీని కట్టడి చేసి ప్రజల్లో ఒంటరి చేసి ఓడించడమే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునగంటి రాజన్న పాల్గొన్నారు.