Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికవర్గానికి సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలత పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలత పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదనీ, అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసి లాంటి అనేక సంస్థల ద్వారా లబ్ది చేకూరుస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్లకు పన్నులు తగ్గించి సామాన్యులపై గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచి భారాలు మోపడం దుర్మార్గమన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ చేయకపోవడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్లతో పూర్తిగా హరిస్తోందన్నారు. విద్యుత్ సవరణ చట్టం వల్ల సామాన్యులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరిట కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య తదితరులు ప్రసంగించారు. భూపాల్, జె.వెంకటేశ్, జయలక్ష్మి, పద్మశ్రీ, ఎస్.రమ, టి.వీరారెడ్డి, సుధాకర్ తదిరులు పాల్గొన్నారు.
త్రిపుర కార్మికోద్యమానికి సంఘీభావం
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తరువాత వామపక్షాల, కార్మిక, ప్రజా సంఘాల కార్యకర్తలపై దాడులు చేస్తూ కార్యాలయాలను ధ్వంసం చేయడాన్ని సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. త్రిపుర కార్మికోద్యమానికి సంఘీభావం తెలిపింది. రాష్ట్ర కమిటీ తరఫున రూ.2 లక్షలు సంఘీభావ నిధిని అఖిల భారత అధ్యక్షులు కె. హేమలత గారికి అందజేసింది.