Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 14 నుంచి 'బీజేపీ కో హఠావో.. దేశ్ కో బచావో' పాదయాత్ర
- ఈ నెల 25 నుంచి వరంగల్‌లో ప్రజాపోరు యాత్ర: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హనుమకొండ
దేశంలో అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక రోజు జైలుకెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండలోని హరిత హోటల్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో సుమారు రూ.150 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన మతతత్వ, అవినీతికర పార్టీ బీజేపీ అని, విజరు మాల్యా, లలిత్ మోడీ నుంచి మొదలుకొని ఆదానీ వరకు లక్షల కోట్లు కొల్లగొట్టిన వారేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న కుంభకోణాలకే ప్రభుత్వాలు కూలిపోయాయని, నేడు లక్షల కోట్ల అవినీతి జరిగినా పట్టింపు లేదన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికలు జరుగనున్న డిల్లీ, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించి సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో బినామీల పాత్ర ఉందంటూ డిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారని అన్నారు. అందుకే 'బీజేపీ కో హఠావో..దేశ్ కో బచావో' పేరుతో ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంటింటికీ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. అలాగే జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి బీజేపీని తరిమి కొట్టడమే తమ లక్ష్యమని, ఆ పార్టీని రానున్న ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం చేస్తామన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే ఎన్నికల్లో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రజాపోరు యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. పాదయాత్రను 25న బయ్యారంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభిస్తారని, ఏప్రిల్ 5న హనుమకొండలో పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి. రాజా హాజరవుతారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, బి. విజయ సారథి, సిహెచ్ రాజారెడ్డి, కె. రాజ్ కుమార్, తోట మల్లికార్జున రావు, నాయకులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, మండ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.