Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు వేగవంతం
- నిందితులకు 14రోజుల రిమాండ్ విధింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధ్వర్యంలోని సిట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేయనున్నారు. ఇందులో భాగంగా బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో నమోదై న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సిట్ సేకరించింది. నిందితుల విచారణ సహా టెక్నికల్ ఆధారాలు సేకరించారు.
కాగా, రెండు పేపర్స్ లీక్ అయినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల నుంచి 24 పేజీల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ప్రశ్నాపత్రాలు, 25 పేజీల టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్ ప్రశ్నపత్రాల జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. దాంతో ఏఈ పేపర్‌తోపాటు, టీఈబీఓ పేపర్‌కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం పోలీసులు 9 మంది నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14రోజల రిమాండ్ విధించింది. దాంతో నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించిన పోలీసులు, మిగిలిన 8 మందిని చర్లపల్లి జైలుకు తరలించారు.
కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్, సిటీ అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడారు. లీక్ అయిన పేపర్స్ ఇద్దరికి మాత్రమే అందినట్టు గుర్తించామని తెలిపారు. నిందితుల ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌ను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తిలేదన్నారు. గ్రూప్-1 పేపర్‌లీక్ అయినట్టు తమ దృష్టికి రాలేదని, దానిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించిన కేసు దర్యాప్తుపై పూర్తి దృష్టిసారించామని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అదనపు సీపీ విక్రమ్‌సింగ్ తెలిపారు.
లీకేజీపై 48 గంటల్లో నివేదిక సమర్పించాలి
టీఎస్పీయస్సీకి రాజ్ భవన్ లేఖ
టీయస్పీయస్సీ నిర్వహించిన, నిర్వహించాల్సిన నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై 48 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని రాజ్ భవన్ కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ కార్యాలయం మంగళవారం టీయస్పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ అంశాన్ని గవర్నర్ తీవ్రంగా పరిగణించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. సమగ్ర విచారణకు ఆదేశించి, నివేదిక సమర్పించాలని తెలిపింది. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను కాపాడటానికి, ఇలాంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని లేఖలో సూచించారు. బాధ్యులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.