Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణం చేపడతాం
- రియల్టర్లను వదిలి పేదలపై ప్రతాపమా?: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు చేసిన వాగ్ధానం మేరకు అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, లేకపోతే పోరాటాల ద్వారా ఆక్రమించుకున్న స్థలాల్లోనే ఇండ్ల నిర్మాణం చేపడతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్ హెచ్చరించారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను రియల్టర్లు ఆక్రమిం చుకుంటే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారిక యంత్రాంగం.. పేదలు తల దాచుకు నేందుకు గుప్పెడు జాగా అడిగితే పూర్తి నిర్బంధం ప్రదర్శిస్తోందని విమర్శించారు. నెహ్రునగర్ గ్రామంలో గుడిసెలు వేసుకున్న పేదలకు భరోసా కల్పించారు. ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని దీమానిచ్చారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలను సాగర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, గృహలక్ష్మి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ అధికారులు పేదల గుడిసెల జోలికి రావొద్దని హెచ్చరించారు. దమ్ముంటే ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాటిని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చినట్టుగా పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేయాలని కోరారు. ఇక జిల్లాలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాళాలు వేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన పేదలకు ఆ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
నగరాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించడంపై నిషేధం విధిస్తూ తెచ్చిన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. సర్కారు ఓ వైపు బహుళ జాతి కంపెనీలకు ప్రభుత్వమే భూములను సేకరించి భూబ్యాంక్ ఏర్పాటు చేస్తోందని, మరోవైపు పేదలకు ఇవ్వాలంటే భూములు లేవని చెబుతోందని వాపోయారు.
కోనేరు రంగారావు కమిటీ.. పెత్తందారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను బయటికి తీస్తే ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఇవ్వొచ్చని నివేదించిందని, కానీ ఆ నివేదికను బయటకు రాకుండా సర్కారు తొక్కి పెట్టిందని ఆరోపించారు. దీన్ని బట్టి సర్కారుకు పేదలపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, గుడిసె వాసులు పాల్గొన్నారు.