Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులోగా వైద్యశాఖలో, సెప్టెంబర్‌లోగా గురుకుల పాఠశాలల్లో...
- 20 వేల పోస్టుల భర్తీ చేయాలి : సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నియామకాలపై మంగళవారం హైదరాబాద్‌లోని బి.ఆర్.కే.భవన్లో ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు టికే శ్రీదేవి, రోనాల్డ్ రోస్, హెచ్ఆర్ఎం అండ్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వీ.వీ.శ్రీనివాస రావు, యూనివర్సిటీ కామన్ బోర్డు చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాంతికుమారి మాట్లాడుతూ, ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదలైనట్టు తెలిపారు. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా దాదాపు పది వేల వివిధ స్థాయిల్లోని ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్ లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు శాంతి కుమారి స్పష్టం చేశారు.
ఉద్యోగాల నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాల్లో కొన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి ఆయా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. కొన్ని నోటిఫికేషన్లకు ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశామని అధికారులు ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. గ్రూప్ 2 ,3 ,4 నోటిఫికేషన్లకు సంబంధించి జూలైలోగా రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కానున్న అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారి చేయగా ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామనీ, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ లోగా నియామకాలు చేపడతామని చెప్పారు.
పల్లెప్రగతితో మెరుగైన గ్రామీణ జీవన ప్రమాణాలు
రాష్ట్రంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, గామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, తదితర ఉన్నతాధికా రులు హాజరైన ఈ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, హరిత హారం లాంటి రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాల వల్లనే వంద శాతం గ్రామాలు ఓడీఎఫ్‌గా మారాయన్నారు. ఇంజనీర్-ఇన్-చీఫ్ సంజీవరావు, స్పెషల్ కమిషనర్, ఆర్డీవీఎస్వీఎన్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.