Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మిస్తాం : టీపీసీసీ ఆధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- పనులు పరిశీలించి భూ నిర్వాసితులతో మాట్లాడిన రేవంత్
నవతెలంగాణ-మోపాల్
సీఎం కేసీఆర్ కేవలం ధనార్జన కోసం మంచిప్ప రిజర్వాయర్‌ను రీ డిజైన్ చేయిస్తున్నారని, ఆయకట్టు విస్తీర్ణం పెరగకున్నా ముంపు పెంచాడని, దాంతో ఊర్లకు ఊర్లే ముంపునకు గురవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇంత జరుగుతున్నా స్థానిక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముంపు బాధితుల గోడు ఇప్పటి వరకు వినలేదని, బాధితులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాగానే రీ డిజైన్ పనులు నిలిపివేసి పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడతామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మంగళవారం నిజామాబాద్ జిల్లా మంచిప్ప మీదుగా డిచ్పల్లి వరకు సాగింది. ముందుగా మంచిప్ప మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఇందరూర్ తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యం చేస్తున్న మాపల్లె వాసులను అభినందించారు. అనంతరం కాళేశ్వరం ప్యాకేజీ 21 పనుల్లో భాగంగా మంచిప్ప రిజర్వాయర్‌ను పరిశీలించారు. ముంపు బాధిత కమిటీ నాయకులతో, బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల పూర్వపరాలను వివరించారు. 'తెలంగాణలో ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయని, కరువు ప్రాంతాలకు ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు అందించగలమనే ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం ప్రారంభించారని తెలిపారు. రూ.38 వేల కోట్లతో 14 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ఉద్దేశంతో పనులు చేపట్టారన్నారు. అందులో భాగంగానే ఈ కొండం చెరువు (మంచిప్ప రిజర్వాయర్) 0.84 టీఎంసీల కెపాసిటీతో 21వ ప్యాకేజీ పనులను రూ.1200 కోట్ల అంచనాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనులు ప్రారంభించి దాదాపు రూ.900 కోట్లు ఖర్చుపెట్టి 70 నుంచి 80 శాతం పనులను పూర్తి చేశామన్నారు. 1,83,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా పనులు చేపట్టామని, కెపాసిటీ పెంచేందుకు ప్రయత్నిస్తే ఇక్కడున్న దళిత, గిరిజనులు, బీసీలు వారి భూములు కోల్పోతారని, తండాలు ముంపునకు గురవుతాయని గ్రామాలను కూడా తరలించాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో అదే కెపాసిటీతో పనులు చేపట్టినట్టు తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ కేవలం ధనార్జన కోసమే ఈ ప్రాజెక్టు రీ డిజైన్ చేపడుతున్నారని ఆరోపించారు. రీ డిజైన్‌తో ముంపు పెంచిన సాగు విస్తీర్ణం మాత్రం అంతంత మాత్రంగానే పెంచారని ఆరోపించారు. ఇంకో ఆరు నెలల్లో ఎలక్షన్ల కోసం ఓట్ల అడగడానికి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వస్తే.. మంచిప్ప గ్రామంలోకి రానివ్వద్దని, తమ గ్రామానికి వస్తే వాతలు పెట్టాలని సూచించారు.
సొంత నియోజకవర్గంలో, ప్రజల భూములు పోతుంటే ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నాడని, కనీసం వాళ్ళని పరామర్శించే నైతిక విలువ కూడా లేదని అన్నారు. ముంపు బాధితులపై నమోదు చేసిన కేసులను వచ్చే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎత్తివేసి, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నాయకులు ఇరవత్రి అనిల్, నగేష్ రెడ్డి, గంగారెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి కే సూర్య రెడ్డి, శేఖర్ గౌడ్, మోపాల్ మండల అధ్యక్షుడు బూన్నీ రవి, తదితరులు పాల్గొన్నారు.