Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో వైద్య పరికరాల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. జీఎస్టీ, దిగుమతి పన్నుల విధింపుతో మేక్ ఇన్ ఇండియాపై ప్రభావం పడుతున్నదని తెలిపారు. వైద్యపరికరాల విడిభాగాలపై విధిస్తున్న పన్ను సామాన్యులకు చవకగా ఆరోగ్యసంరక్షణ అందించడానికి ఇబ్బందిగా మారుతున్నదని చెప్పారు. ఆరోగ్యరంగంపై జీఎస్టీ తిరిగి చెల్లించే పన్ను కాదని తెలిపారు. వైద్య పరికరాలు విలాసవస్తువులు కాదంటూ, ఆరోగ్యసంరక్షణను అందరికీ చేరువ చేసేవని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్య, రోగ నిర్ధారణ పరికరాలపై ఉన్న 18 శాతం పన్నును 12 శాతం, ఐదు శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఈ రంగంలో అగ్రగామి 20 దేశాల్లో ఒకటిగా, ఆసియా ఖండంలో నాలుగో స్థానంలో నిలిచిన భారతదేశానికి ఈ తగ్గింపు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య పరికరాల దిగుమతితో ఖర్చు పెరగడమే కాకుండా, అవి వచ్చేందుకు ఆరు నెలల నుంచి 12 నెలల సమయం పడుతున్నదనీ, దీన్ని నివారించేందుకు దేశీయంగా తయారీకి ప్రోత్సాహకాలివ్వాలని సూచించారు. హైదరాబాద్ మెడికల్ డివైజెస్ పార్కులో మెడికల్ ఇమేజింగ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రంలో భాగస్వామి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటులోనూ భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.