Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) 'జనచైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మూడు బృందాలు ''జనచైతన్య యాత్ర'' పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నాయి. ఈ యాత్రల ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను ఎండగడతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్న ఈ యాత్రకు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో తమ్మినేని వీరభద్రంతోపాటు, యాత్రకు నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జాన్వెస్లీ జనచైతన్య యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశానికి చేసిన దుర్మార్గాలను ఎండగడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, మతోన్మాదం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ యాత్ర జరుగుతున్నదని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమైన సిద్ధాంతాలు, ప్రజల మధ్య పెడుతున్న మత చిచ్చు, ఈ దేశాన్ని మధ్యయుగాల నాటి పురాతన సంస్కృతికి తీసుకుపోవడానికి చేసే దాని ప్రయత్నాలను ప్రజల ముందుంచుతామని వివరించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ యాత్రను జరిపెందుకు నిర్ణయించామన్నారు. దాదాపు ప్రజా ఉద్యమ అభిమానులు, అభ్యుదయవాదులు, సామాజిక శక్తుల సమావేశం ఇప్పటికే జరిగిందనీ, వారందరూ ఈ యాత్రను బలపరుస్తున్నారనీ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ యాత్రలో పరస్పరం సహకరించుకోవాలంటూ సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల ఉమ్మడి సమావేశం నిర్ణయించిందని వివరించారు.