Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 54 శాతానికి పెరిగిన నకిలీ కరెన్సీ
- దేశానికి రూ.ఐదు లక్షల కోట్ల నష్టం :మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలకు చెప్పిన ప్రయోజనాలు నెరవేరలేదనీ, అందువల్ల ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, కృష్ణమోహన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్ లతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుతో నకిలి కరెన్సీ అరికట్టకపోగా 54 శాతానికి పెరిగిందనీ, డిజిటల్ కరెన్సీ లక్ష్యం మాటేమో గానీ అంతకు ముందున్న జీడీపీలో 11 శాతాన్ని మించి 13 శాతం కరెన్సీ వాడకం పెరిగిందని విమర్శించారు. నోట్ల రద్దు అట్టర్ ప్లాఫ్ షో అనే విషయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో స్పష్టమైందన్నారు. నల్లధనం పెరిగిందనీ, 592 కేసుల్లో రూ.40 వేల కోట్లు పట్టుకున్నారని గుర్తుచేశారు. నోట్లు మార్చుకోవడానికి క్యూలైన్లలో నిలబడి 108 మంది మరణిస్తే, 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. కొత్త నోట్ల ముద్రణకు రూ.21 వేలు కోట్లు ఖర్చు పెట్టారనీ, ఆ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయ్యేదని మంత్రి వివరించారు. నోట్ల రద్దు తో 50 రోజుల్లో అంతా బాగుంటుందంటూ బీజేపీ భరోసా ఇచ్చిందనీ, అది జరిగి ఇప్పటికి రెండువేల రోజులైందని గుర్తుచేశారు. మోడీ హయంలో రూ. కోటి ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చారనీ, స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం పెరిగిందని చెప్పారు. విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతపిచ్చి పెంచడంలో బీజేపీ విజయం సాధించిందని విమర్శించారు. బీజేపీ హఠావో... దేశ్ కో బచావో అనేది తమ నినాదమని స్పష్టం చేశారు.