Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వాల వివక్ష
- ప్రజాసంఘాలు, కేవీపీఎస్ మహాధర్నాలో బీవీ రాఘవులు
- మాట్లాడుతున్న బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత, గిరిజనులపై ప్రభుత్వాల వివక్ష దుర్మార్గంగా ఉందని దళిత్ సోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ నాయకులు బీవీ రాఘవులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ప్రజాసంఘాలు, కేవీపీఎస్ ఆధ్వర్యంలో బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ..'రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ' అనే అంశంపై మహాధర్నా నిర్వహించాయి. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ దర్నాలో రాఘవులు మాట్లాడుతూ దళిత, గిరిజనులను దొరలు, భూస్వాములు, అగ్రకుల పెత్తందార్లనుంచే కాకుండా..పాలకుల నుంచి కూడా వివక్షకు గురవుతున్నారని చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన పాలకులు వీరి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం వివక్ష కాకపోతే మరేంటని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి, ప్రణాళికాబద్ధంగా వారి అభివృద్ధికి కృషి చేయడం లేదని చెప్పారు. 16శాతంగా ఉన్న ఎస్సీ జనాభాకు ఏడు శాతం నిధులు కేటాయించి, అందులో మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్లైఓవర్లు, స్టేడియాలు తదితర నిర్మాణాల్లో దళితుల వాటా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవి వారి అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో చెప్పాలని ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్థాయిలోనే దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడే విధంగా సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అందుకు తగిన పోరాట కార్యాచరణ జాతీయ స్థాయిలో రావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరిస్తున్నదని చెప్పారు. మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించకపోగా.. ఉన్న పరిశ్రమలను తెగనమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగమంతా నాశనమైతే..ఇక రిజర్వేషన్ల అమలు సంగతేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్లను చంపడానికే దొడ్డిదారిన ప్రయివేటీకరణను ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నదని చెప్పారు. పరిశ్రమలు వస్తే..ఉద్యోగాలు రావచ్చుగానీ..అందులో రిజర్వేషన్లు అమలుకానప్పుడు దళిత, గిరిజనులకు ఉద్యోగాలెలా వస్తాయో చెప్పాలన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయటమంటే..నాణ్యతను దెబ్బతీయటమనే చర్చ చేయటం దుర్మార్గమన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కుల వ్యవస్థను యథాతథంగా కాపాడలని భావించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించారు. అందుకే పోరాడడం ద్వారానే వాటిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కుల వ్యవస్థ దేశాన్ని పట్టిపీడిస్తున్నదనీ, దాన్ని నాశనం చేయలన్నారు. యూనివర్సిటీల్లో సైతం ర్యాగింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. అంబేద్కర్‌కు దండంపెట్టి దండేస్తే సరిపోదనీ, ఆయన పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ దళితుల్ని భూమికి దూరంగా ఉంచితే..వారిలో అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. భూస్వాములు, కార్పొరేట్ల దగ్గర భూమంతా కేంద్రీకరించబడి ఉందని చెప్పారు. బీజేపీ విధానాల ఫలితంగా దేశంలో కొద్దిమంది చేతుల్లో సంపదంతా పోగుబడి ఉందని చెప్పారు. ఎక్కువ మంది ప్రజలు పేదలుగా, నిరుపేదలుగా ఉన్నారన్నారు. అయినా కార్పొరేట్లకే ఈ ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో దానికి భారీ కోతలు విధించిదని గుర్తుచేశారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య మాట్లాడుతూ సేవా వృత్తులపై వివక్ష కొనసాగుతున్నదని చెప్పారు. దళితులు, గిరిజనులతోపాటు వృత్తిదారులపైనా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు.వీటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ గిరిజనులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్లుగా బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని చెప్పారు. మహాధర్నా సందర్భంగా 12 డిమాండ్లతో కూడిన పత్రాన్ని విడుదల చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్‌లో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ఏగొండ స్వామి, లక్ష్మి, డీబీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రమేశ్, జైభీమ్ మహాసేన అధ్యక్షులు మంచింటి అంజన్న, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సామేలు, ఏ మాణిక్యం, జి రాజు, పల్లేర్ల లలిత, సహాయ కార్యదర్శి కోట గోపి, బొట్ల శేఖర్, సోమారపు రవితోపాటు రాష్ట్ర కమిటి సభ్యులు పాల్గొన్నారు.