Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ ప్రకారమే మెయిన్స్ పరీక్షలు
- విచారణలో లీకైనట్టు తేలితే 'ప్రిలిమ్స్' రద్దు
- ప్రవీణ్‌కు 103 మార్కులు వాస్తవమే
- ఓఎంఆర్‌లో డబుల్ బబ్లింగ్‌తో అనర్హత
- ఏఈ పరీక్షపై నేడు నిర్ణయం
- రూ.10 లక్షలకు ప్రశ్నాపత్రం అమ్ముకున్నారు
- నమ్మిన వారే గొంతుకోశారు
- ఆ ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోతారు
- భవిష్యత్తులో జరిగే పరీక్షలకు కొత్త ప్రశ్నాపత్రాలు : టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లీకేజీకి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారనీ, గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం లీకైనట్టు తేలితే ఆ పరీక్షను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. జూన్ ఐదు నుంచి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన అంశంపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో అక్టోబర్ 16న నిర్వహించిన పరీక్షకు 2,85,916 మంది హాజర య్యారని వివరించారు. ప్రాథమిక కీని విడుదల చేశామనీ, వాటిపై అభ్యంత రాలను స్వీకరించామనీ అన్నారు. వాటిని సబ్జెక్టు నిపుణులకు పంపించి తుది కీని విడుదల చేశామన్నారు. మల్టీ జోన్, కమ్యూనిటీ వారీగా 1:50 నిష్పత్తిలో 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశామని చెప్పారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశారనీ, 103 మార్కులొచ్చిన మాట వాస్తవమేననీ వివరించారు. అయితే ఓఎంఆర్‌లో డబుల్ బబ్లింగ్ చేయడంతో అనర్హత పొందారని అన్నారు. అతని తండ్రి చనిపోతే కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలోకి వచ్చారని వివరించారు. దేశంలోనే తొలిసారిగా గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో మల్టిపుల్ జంబ్లింగ్ ప్రశ్నలతోపాటు జవాబులనూ జంబ్లింగ్ చేశామని చెప్పారు. మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేదన్నారు. తన కూతురు గ్రూప్-1 పరీక్ష రాసినట్టు వదంతులు వస్తున్నాయని అన్నారు. తన కుటుంబ సభ్యులెవరూ ఈ పరీక్ష రాయలేదని స్పష్టం చేశారు. అవసరమైతే చైర్మెన్ పదవిని వదులుకుంటాను తప్ప తప్పుడు పనులకు అవకాశమే లేదన్నారు. టీఎస్పీఎస్సీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, నెట్వర్క్ ఎక్స్పర్ట్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్లోని ఐపీ అడ్రస్ సహాయంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నాపత్రాన్ని హ్యాకింగ్ చేశారని చెప్పారు. ఈనెల 12న ఏఈ పరీక్ష నిర్వహించాల్సి ఉందనీ, అయితే ఈనెల 11న అనుమానంతో బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల్లోనే పోలీసులు విచారణ చేసి ప్రశ్నాపత్రం లీకైనట్టు నిర్ధారణ చేశారని వివరించారు. దీంతో ప్రవీణ్‌ను సస్పెండ్ చేశామనీ, రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలోనుంచి తొలగించామని అన్నారు. రూ.పది లక్షలకు ఆ ప్రశ్నాపత్రాన్ని అమ్మినట్టు తేలిందని చెప్పారు. ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారని అన్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారనీ, ఎన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయో తేలుతుందని వివరించారు. ఆ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అయితే ఏఈ పరీక్షను రద్దు చేయాలా?, కొనసాగించాలా? అన్నదానిపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో నిర్వ హించబోయే పరీక్షలకు సంబంధించి కొత్త ప్రశ్నాపత్రాలను తయారు చేస్తామని అన్నారు.
17,134 పోస్టులకు 26 నోటిఫికేషన్లు ఇచ్చాం
రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో 17,134 పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లను విడుదల చేశామని జనార్ధన్‌రెడ్డి చెప్పారు. ఇందులో ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించామన్నారు. ఎనిమిదో పరీక్ష టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశామని వివరించారు. కొన్ని పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో 30 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని వివరించారు. 40 శాఖల్లోని వివిధ కేటగిరీకి 23 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. టీఎస్పీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని అన్నారు. ఉద్యోగ నియామక సంస్థలపై అభ్యర్థులు నమ్మకంతో ఉండాలని సూచించారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియను చేపట్టేందుకే ఈ బాధ్యతను స్వీకరించానని చెప్పారు. దురదృష్టకర వాతావరణంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీలో ఉన్న ప్రవీణ్ పర్మినెంట్ ఉద్యోగి, రాజశేఖర్‌రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగి, ఓ కానిస్టేబుల్, రేణుక భర్త డీఆర్డీవోలో టెక్నికల్ అసిస్టెంట్, ఆమె గురుకులంలో టీచర్‌గా పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఐదుగురు ఉద్యోగాలను కోల్పోతారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ డబ్బుకు ఆశపడి ఇలా చేయడం బాధాకరమని అన్నారు. సిబ్బందిని కూడా ఇంట్లోవారిలాగా నమ్ముతామనీ, ప్రతి ఒక్కరినీ అనుమానించలేమని చెప్పారు. అయితే నమ్మిన వారే గొంతుకోశారని అన్నారు. ఈ సంఘటన తర్వాత సైబర్ భద్రత మరింత అవసరమని భావిస్తున్నామని వివరించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నివేదిక వచ్చాక పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.