Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ నిర్ణయం
- ఇంకా ఎన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో?
- అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ
- మూడోరోజు టీఎస్పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం
- సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
- నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ
- హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : ఏబీవీపీ
- లీకేజీలో ఏ2 రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త
- ఆధారాలు బయటపెట్టిన బీఆర్ఎస్ నాయకులు
రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు ఈనెల ఐదో తేదీన నిర్వహించిన పరీక్షా ప్రశ్నాపత్రం లీకైనట్టు పోలీసుల విచారణలో తేలిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. దీంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 14న ఏఈ పరీక్ష లీకైనట్టు సెంట్రల్ క్రైం స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఆ పరీక్షను రద్దు చేస్తున్నామనీ, పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామనీ వివరించారు. అయితే అభ్యర్థుల్లో ఉత్కంఠ వీడడం లేదు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈతోపాటు ఇంకా ఎన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకయ్యాయోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూనే ఏ1గా ఉన్న ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏబీవీపీ ముట్టడించాయి. దీంతో మూడోరోజూ అక్కడ పరిస్థితి అట్టుడికింది. ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. లీకేజీపై సమగ్ర విచారణ చేయాలంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇదిలావుండగా బుధవారం మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రం లీకేజీలో ఏ2గా ఉన్న అట్ల రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అంటూ ఆధారాలతో సహా బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది బీజేపీ కుట్ర అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రకటించింది. రిక్రూట్‌మెంట్‌ను ఆపడానికి బీజేపీ చేసిన కుట్ర అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. 48 గంటల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. చివరికి లీకేజీ వ్యవహారం రాజకీయ అంశంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ దర్యాప్తు చేపట్టింది. అధికారులు, సిబ్బందిని అడిగి పలు విషయాలను అధికారులు తెలుసుకున్నారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నాపత్రాల లీకేజీలో టీఎస్పీఎస్సీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. హాస్టళ్లలో ఉంటూ, కోచింగ్‌లకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నానా ఇబ్బందులు పడ్డ నిరుద్యోగులకు ఈ ఘటన తీవ్ర నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ మనస్థాపాన్ని కలిగించిందని పేర్కొన్నారు. విచారణ కోసం ఏర్పాటు చేయబడ్డ సిట్ ఎనిమిది మంది నిందితులను రిమాండ్‌కు పంపడంతోనే సరిపెట్టకుండా, నియామకాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ చైర్మెన్, కార్యదర్శి, మొత్తం సభ్యుల పాత్రపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లీకేజీ అయిన పేపర్ల పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ ఇంత నిర్లక్ష్యంగా వ్యహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. డిపార్టుమెంట్ వ్యవహారాలు, పరీక్ష పేపర్లు, కీలకమైన పాస్వర్డ్ కమిషన్ లేదా చైర్మెన్, సెక్రటరీలకు మాత్రమే తెలుస్తాయని వివరించారు. కానీ సెక్షన్ ఆఫీసర్ ఇంత కీలకమైన పేపర్లను ఫొటో తీసుకున్నాడంటే అక్కడ వాటికి భద్రత కల్పించడంలో బాధ్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుందని తెలిపారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షా పేపర్లు కూడా లీకైనట్టుగా వస్తున్న వార్తలపై టీఎస్పీఎస్సీ పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సమగ్ర విచారణ జరపాలి : ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ
సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీపై టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులు, కార్యదర్శి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రహస్య విభాగంలోకి ఇతర సెక్షన్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు వారి చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, నాయకులు కిరణ్, నాగేంద్ర, డీవైఎఫ్ఐ నగర నాయకులు హస్మీబాబు తదితరులు పాల్గొన్నారు. లీకేజీ కుంభకోణం తెరవెనుక ఉన్న తెరవెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను అరెస్టు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
రాజశేఖర్‌రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త
ప్రశ్నాపత్రం లీకేజీలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ తరఫున అతడు ప్రచారం చేసినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేందుకే ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.