Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రజానాట్యమండలి
- బీజేపీపై పోరుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు
- ప్రజల్లో చైతన్యం నింపుతున్న వీధినాటకోత్సవాలు
- సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రలకు మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కళ ప్రజల కోసం అనే నినాదంతో పురుడుపోసుకున్న ప్రజానాట్యమండలి తెలుగునాట ప్రజా సాంస్కృతికోద్యమ సారధిగా పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో దేశ ప్రగతిని తిరోగమనం వైపు తీసుకెళ్తున్న మోడీ పాలనపై ప్రజలను చైతన్యపరిచేందుకు కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నది. మనువాద భావజాలంతో ప్రజలను అణచిఉంచుతున్న ఆర్ఎస్ఎస్ తీరును, దాని ఆసరాతో రాజకీయ లబ్ది పొందుతున్న బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నది. సమాజ మార్పు కోసం సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాన్ని తీసుకురావడానికి తనవంతు పాత్ర పోషిస్తున్నది. ఆర్ఎస్ఎస్ భావజాలంపై పోరు చేస్తున్న పార్టీలకు, ప్రజాసంఘాలకు అండగా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే సీపీఐ(ఎం) తలపెట్టిన జనచైతన్య యాత్రలకు సంఘీభావంగా కార్యాచరణకు పూనుకుంటున్నది.
జనచైతన్య యాత్రకు మద్దతుగా క్యాసెట్
కవులు, రచయితలు, గాయకులను పీఎన్ఎమ్ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వారు సృష్టించిన ప్రజలను చైతన్యపరిచే సాహిత్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్తున్నది. ప్రత్యేకంగా 10 పాటలతో ఓ ఆడియో క్యాసెట్‌ను రూపొందిస్తున్నది. అదే సమయంలో జనచైతన్య యాత్ర లక్ష్యాలను, ప్రజల సమస్యలను బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తెలియజేసే కళారూపాలను తయారుచేస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రాంతాల్లో శిక్షణాశిబిరాలను ప్రారంభించింది. సామాన్యుల ఇబ్బందులకు కారణకులెవరు? వివరించేలా ప్రత్యేక నాటికను పీఎన్ఎమ్ ప్రదర్శించనున్నది.
యాత్రకు సంఘీభావంగా వేలాదిగా కళాకారులు
యాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానాట్యమండలి బృందాలు గ్రామాల్లో సిద్ధమవుతున్నాయి. వీరితోపాటు జానపద కళారంగంలో వందలాది కళాబృందాలను, వేలాది కళాకారులను యాత్ర కోసం కదిలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందుకోసం అన్ని జిల్లాల్లో ప్రజానాట్యమండలి కమిటీలు కృషి చేస్తున్నాయి. ప్రజా, కళారంగంలో భావసారూప్యం కలిగిన పలు సంస్థలను, ప్రసిద్ధ సినీ, నాటక రంగ ప్రముఖులను కూడా ఈ యాత్రలో భాగస్వాముల్ని చేయడానికి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు కలిసి వచ్చేందుకు తమ సంసిద్ధతను తెలియజేస్తున్నాయని నాయకత్వం తెలియజేసింది.
మూడు టీమ్‌లు..60 మంది కళాకారులు
జన చైతన్య యాత్రలతో పాటు ప్రజానాట్యమండలికి చెందిన మూడు బృందాలు కలిసి సాగనున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది సభ్యులు ఉండనున్నారు. డప్పు, నృత్యం, పాటలు పాడటం, నాటికలను ప్రదర్శించడం ఇలా విభిన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించే కళాకారులు ఈ బృందాల్లో ఉండనున్నారు. ఆ బృందాలు యాత్ర కొనసాగే ప్రాంతాలకు ముందే చేరుకుని తమ ప్రదర్శనల ద్వారా ప్రజలను ఉత్తేజ, చైతన్యపర్చనున్నాయి.
జనచైతన్య యాత్రలకు కళాకారుల సంపూర్ణ మద్దతు
సీపీఐ(ఎం) పార్టీ తలపెట్టిన జనచైతన్య యాత్రలకు ప్రజానాట్యమండలి సంపూర్ణ మద్దతు ఉంటుంది. యాత్ర సాగే ప్రాంతాల్లో కళాకారులంతా నేరుగా పాల్గొని మద్దతు తెలుపనున్నారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, అది అమలైతే ప్రజలు బానిసలుగా ఏవిధంగా అణచివేయబడతారనే అంశంపై ప్రజలను నిరంతరం చైతన్య పరిచడంలో పీఎన్ఎమ్ ముందు వరుసలో ఉంటుంది. ప్రజలకు మేలు చేసే ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసేందుకు బీజేపీపై ఎక్కుపెట్టడానికి సరైన బాణం సాంస్కృతికోద్యమే.
- ప్రజానాట్యమండలి
రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ