Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేజా రకం ఖమ్మం మార్కెట్లో రూ.22,501, వరంగల్లో 23 వేలు..
- సింగల్ పట్టి క్వింటాల్ రూ. 63వేలు
- ఈ సీజన్లో ఇదే రికార్డు స్థాయి ధర
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/కాశిబుగ్గ
ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి మెరిసింది. తేజా, సింగల్ పట్టి రకం మిర్చి ధరలు రికార్డు నమోదు చేస్తున్నాయి. సీజన్లోనే అత్యధికంగా బుధవారం వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి రూ23వేలు పలుకగా, ఖమ్మం మార్కెట్లో రూ.22,501 రేటు పలికింది. ఒక్కరోజులోనే మిర్చి ధర ఒక్కసారిగా క్వింటాకు దాదాపు రూ.వెయ్యికి పైగా పెరిగింది. చివరికి తాలు మిర్చి సైతం రూ.14వేలు పలికింది. నాణ్యతను బట్టి క్వింటాల్ రూ.18వేల నుంచి రూ.23వేల వరకు కొంటున్నారు. పంట విస్తీర్ణంతో పాటు చీడపీడల ప్రభావం కూడా అధికంగా ఉండటంతో దిగుబడి తగ్గింది. ఈ కారణంగా మిర్చి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఆన్ సీజన్లో ఉండాల్సిన రేటు ఇప్పుడే పలుకుతుండటంతో రైతులు కూడా కోత కోసిన వెంటనే విక్రయిస్తున్నారు.
వరంగల్ మార్కెట్లో గరిష్టస్థాయి ధరలు..
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. బుధవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సుమారు 50 వేల బస్తాల మిర్చి వచ్చినట్టు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామానికి చెందిన బానాలు అనే రైతు తేజా రకం మిర్చి 50 బస్తాలు తీసుకురాగా నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ ఆర్తి ద్వారా లాలా ట్రేడింగ్ కంపెనీ రికార్డు స్థాయిలో రూ.23 వేలు ధర పెట్టి కొనుగోలు చేశారు. తేజ రకం మిర్చి 9వేల బస్తాలు రాగా, గరిష్ట ధర రూ.23వేలు పలుకగా కనిష్ట ధర రూ.17వేలు, మోడల్ ధర రూ.21వేలుగా ఉంది. వండర్ హాట్ 1000 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.38,200 కనిష్ట ధర రూ.31వేలు కాగా మోడల్ ధర రూ.35వేలు పలికింది. యూఎస్ 341 రకం మిర్చి 26,500 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.23,600, కనిష్ట ధర రూ.17 వేలు, మోడల్ ధర రూ.21,500కు కొనుగోలు చేశారు. సింగిల్ పట్టి 200 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.63 వేలు, కనిష్ట ధర రూ.45 వేలు, మోడల్ ధర రూ.59 వేలు పలికింది. 1048 రకం మిర్చి 1000 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.22,600, కనిష్ఠ ధర రూ.16 వేలు, మోడల్ ధర రూ.19 వేలుగా ఉంది. ఇందులో వండర్ హాట్, తేజ, సింగల్ పట్టి రకం మిర్చికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.