Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాప్‌ను నమ్ముకోవడంతో పరీక్షకు ఆలస్యం
- సకాలంలో కేంద్రానికి చేరక అనుమతి నిరాకరణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఇంటర్ పరీక్షా కేంద్రానికి బయలుదేరిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తాను చేరుకోవాల్సిన సెంటర్ ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో ఉంటే.. ఎన్నెస్పీ కాల్వ ఉన్న టేకులపల్లి ప్రాంతానికి ఆ విద్యార్థిని తీసుకువెళ్లింది. తిరిగి పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి ఆ విద్యార్థికి 27 నిమిషాలు ఆలస్యమవడంతో నిమిషం నిబంధన కారణంగా అధికారులు అనుమతించలేదు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం రూరల్ మండలం కొండాపురానికి చెందిన వినరుకు ఖమ్మంలోని ఎన్నెస్పీ స్కూల్లో సెంటర్ కేటాయించారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎగ్జామ్ కేంద్రానికి బయలుదేరాడు. కానీ అది ఎన్నెస్పీ కాల్వ వద్ద ఉన్న టేకులపల్లి కేంద్రానికి తీసుకెళ్లింది. తనకు కేటాయించిన కేంద్రం అది కాదని తెలుసుకొని వెనుదిరిగాడు. ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. కానీ వినరు పరీక్షాకేంద్రానికి చేరుకునే సరికి 9.20 గంటలకు పైగా అయింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ంచరనే నిబంధన ఉండటంతో చేసేది లేక కన్నీరుమున్నీరవుతూ వెనుదిరిగాడు. ఈ పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కళాశాలలు సరిపోకపోవడంతో మూడు ప్రయివేటు పాఠశాలలు, ఒక ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నెస్పీ క్యాంప్‌లోని ఓ పాఠశాల పరీక్షా కేంద్రం రూట్‌ను గూగుల్ తప్పుగా చూపించడంతో వినరుకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పనిచేసేలా రెండు సెల్‌ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. సమస్య ఉన్న విద్యార్థులు 99489 04023, 77939 16207 నంబర్లకు సంప్రదించాలని సూచించినా సంబంధిత విద్యార్థి గూగుల్ మ్యాప్ కారణంగా అయోమయానికి గురవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, ముందురోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని పరీక్ష నిర్వాహకులు అంటున్నారు.