Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో టెక్ మహీంద్ర వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సత్యం కంపెనీ తనకు లేని ఆదాయాన్ని చూపించిందనీ, అందువల్ల తప్పుడు ఆదాయానికి పన్ను కట్టాలంటూ ఐటీ శాఖ కోరడం చెల్లదని టెక్ మహేంద్ర హైకోర్టులో వాదించింది. సత్యం కుంభకోణం కారణంగా 2002-2009 కాలంలో వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్స్ (సీబీడీటీ) అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆ కంపెనీ సవాల్ చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. కంపెనీ వాస్తవ ఆదాయం మేరకే పన్ను చెల్లించాలంటూ రాజ్యాంగంలోని 265 అధికరణం చెబుతోందని కంపెనీ వాదించింది. విచారణ ఏప్రిల్ 12కు వాయిదా పడింది.
31న హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు
హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ను స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మెన్ ఎ.నరసింహారెడ్డి వెల్లడించారు. 17న ఓటర్ల జాబితా పూర్తి, 18 నుంచి 20 వరకు నామినేషన్లు, 21న నామినేషన్ల ఉపసంహరణ, 22న పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితా వెల్లడి, 31న ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి. కొత్త కమిటీ ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరిస్తుంది. ఎన్నికలయ్యే వరకు ముగ్గురితో అడహక్ కమిటీని బార్ కౌన్సిల్ నియమించింది. ఇందులో సీనియర్ న్యాయవాదులు టి.సూర్యకరణ్రెడ్డి, ఎల్.రవిచందర్, జి.రవిమోహన్ ఉన్నారు.
18న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోర్టులు షురూ
పురానా హవేలీలో ఏర్పాటు చేసిన కుటుంబ వివాదాల పరిష్కార సమీకృత కోర్టు భవన సముదాయాన్ని ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. వీటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ పీవీ సంజరుకుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభిస్తారు.
మహిళలు ముందుకు రావాలి :సీజే
మహిళలను చైతన్యపరిచే చర్యలు పెరగాలనీ, వారు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. న్యాయవ్యవస్థపై మహిళలు కూడా అవగాహన పెంపునకు, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాలని సూచించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీజే ప్రసంగిస్తూ చట్టాలపై మహిళలను చైతన్యం చేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మహిళా జడ్జీలు జస్టిన్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిన్ రాధారాణి, జస్టిస్ మాధవీదేవి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, జస్టిస్ అనుపమా చక్రవర్తి, జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మాట్లాడారు. కీలక పదవుల్లోకి మహిళలు రావాలని వారు పిలుపునిచ్చారు.