Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉన్నత విద్యామండళ్ల సమావేశాన్ని గురు, శుక్రవారాల్లో రెండురోజులపాటు హైదరాబాద్‌లోని హరిత ప్లాజా హోటల్లో నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 రాష్ట్రాల నుంచి చైర్మెన్, వైస్ చైర్మెన్, కార్యదర్శులుగా ఉన్న 24 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్‌పై సవాళ్లు, అకడమిక్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ఎలా అమలు చేయాలి, అందరికీ అనువైన సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుందని వివరించారు. జాతీయ విద్యా ప్రణాళిక, నిర్వహణ సంస్థ (న్యూపా) వీసీ సుధాంశు భూషణ్, ప్రొఫెసర్ కుమార్ సురేష్ ప్రారంభోపన్యాసం చేస్తారని చెప్పారు. మొదటి రోజు టీ హబ్‌ను సందర్శిస్తామని అన్నారు.
యూజీసీ నుంచి నిధులు రావడం లేదు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఐదేండ్లుగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు నిధులు రావడం లేదని లింబాద్రి చెప్పారు. భారత ఉన్నత విద్య కమిషన్ (హెకీ) వచ్చాక నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. గతంలో విశ్వవిద్యాలయాలు, కాలేజీల అభివృద్ధి, పరిశోధనలకు యూజీసీ నిధులిచ్చేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.